Goda Ranganatha Love Story: ఏటా భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. వైష్ణవ ఆలయాల్లో జరిగే ఈ వేడుక చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ ఈ కళ్యాణ వేడుక అవివాహితులకు వివాహ యోగం ఉంటుందంటారు పండితులు.
శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తులు ఉండేవాడు. శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద పవళించే వటపత్రసాయి ఫొటో చూసి ఉంటారుగా.. అది శ్రీవిల్లిపుత్తూరులోనే అని పురాణాల్లో ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం చిన్ని కృష్ణుడు. నిత్యం కన్నయ్యకు పూలమాలలు సమర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు.
విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు...నిరంతరం విష్ణుసేవలో నిమగ్నం అవడంతో విష్ణుచిత్తులు అనడం ప్రారంభించారు. విష్ణుచిత్తుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువును నేరుగా దర్శించుకుని ఆయనకు మంగళాశాసనాలు ఇచ్చినట్టు ఓ గాథ ప్రచారంలో ఉంది. అందుకే విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా గుర్తించి పెరియాళ్వారుగా గౌరవాన్నిచ్చారు.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!
ఈ పెరియాళ్వారు ఓ రోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా..అక్కడో చిన్నారి కనిపించింది. తులసివనంలో శ్రీ మహాలక్ష్మి కాక మరెవరు ఉంటారు..అందుకే ఆమెను భగవంతుడి ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు. ఆమెకు కోదై ( పూలమాల) అనే పేరు పెట్టాడు. ఆ పేరే కాలక్రమంలో గోదాగా మరింది.
తండ్రి విష్ణుచిత్తుడు కృష్ణుడిని భగవంతుడిగా పూజిస్తే...గోదా కృష్ణుడిని భర్తగా భావించేది. తననే ఆరాధిస్తూ గడిపేది. తన చుట్టూ ఉండేవారంతా గోపికలు అని, తాను నివసిస్తున్న విల్లిపుత్తూరు అప్పట్లో వ్రజపురమని భావించింది.
తండ్రి విష్ణుచిత్తుడు నిత్యం భగవంతుడికోసం సిద్ధం చేసిన పూలమాలలు తండ్రి కంట పడకుండా ముందుగా తాను వేసుకునేది. ఆ తర్వాతే శ్రీ కృష్ణుడిని చేరేవి ఆ మాలలు. ఆ మాలలు స్వయంగా శ్రీ కృష్ణుడే తన మెడలో వేసినట్టు భావించేది గోదా. ఓ సారి ఇదంతా చూసిన విష్ణుచిత్తుడు అపచారం జరిగిందంటూ భగవంతుడిని వేడుకున్నాడు. ఆ రోజు కలలో కనిపించిన శ్రీ కృష్ణుడు అది అపచారం కాదు తనకెంతో ఆనందం అని సెలవిచ్చాడు. ఈ ఘటన తండ్రిద్వారా తెలుసుకున్న గోదాకి కృష్ణుడిపై మరింత ప్రేమ పెరిగింది.
కృష్ణుడితో పెళ్లి జరిగినట్టు భావించేది. ఈ సమయంలో గోదా చేసిన వ్రతమే ధనుర్మాస వ్రతం. నెల రోజుల పాటూ నిత్యం గోపికలను నిద్రలేపుతూ రోజుకో పాశురం పాడుతూ పల్లె అందాలు, భగవంతుడి స్మరణలో గొప్పతనం, శ్రీ కృష్ణుడిపై తనకు ఉండే ప్రేమను చాటిచెప్పింది. అవే ధనుర్మాసంలో పఠించే తిరుప్పావై పాశురాలు.
Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!
గోదాదేవికి ప్రేమకు శ్రీ కృష్ణుడు తలొంచక తప్పలేదు. మళ్లీ విష్ణుచిత్తుడి కలలో కనిపించి ధనుర్మాసం చివరి రోజైన భోగి రోజు గోదాదేవిని తానుండే శ్రీరంగానికి తీసుకురావాలని చెప్పాడు. అక్కడే గోదాను వివాహం చేసుకుంటానని చెప్పి మాయమయ్యాడు రంగనాథుడు. ఆ కలను కుమార్తెకు చెప్పిన విష్ణుచిత్తుడు స్వయంగా గోదాను తీసుకుని శ్రీరంగం వెళ్లాడు. అక్కడభక్తులంతా చూస్తుండగా గోదాదేవి అలా నడుచుకుంటూ వెళ్లి రంగనాథుడిలో ఐక్యం అయిపోయింది. అంటే పరిణయం జరిగిపోయింది. అప్పటి నుంచి ఏటా భోగి రోజు గోదారంగనాథుల కళ్యాణం జరుపిస్తున్నారు.
గోదా రంగనాథుల కళ్యాణం చూసినవారికి వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి, వైవాహిక జీవితంలో ఉండే కలతలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.
Also Read: భోగ భాగ్యాలనిచ్చే భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!