Must Read Sthothra Before Climbing Tirumla: అన్నమయ్య సినిమాలో నాగార్జున అందరి భక్తులతో పాటూ గోవిందనామాలు చెబుతూ కొండెక్కుతుంటాడు (Tirumala Darshan by Walk). కొంత దూరం వెళ్లిన తర్వాత కిందపడిపోతాడు. అప్పుడు పద్మావతి అమ్మవారు వచ్చి పైకి లేపుతుంది. అంతా కొండెక్కుతున్నారు కానీ నేను కిందపడిపోయాను. అంటే నా దీక్షలో ఏదైనా లోపం ఉందేమో అంటాడు అన్నమయ్య. పవిత్రమైన కొండకి పాదరక్షలతో రాకూడదు..ఎందుకంటే ఇక్కడ అణువణువు వేంకటేశ్వరుడు నిండి ఉన్నాడు. ఇక్కడుంటే ప్రతి రాయి, ప్రతి చెట్టు పరమాత్ముడి స్వరూపమే. అందుకే చెప్పులు తీసేసి కొండెక్కమంటుంది. అప్పుడు చెప్పులు విడిచి కొండెపైకి వెళతాడు అన్నమయ్య. 


అయితే.. కొండపై ప్రతి అణువు పరమాత్మ స్వరూపం, కొండంతా సాలగ్రామ శిలే అయినప్పుడు చెప్పులు వేసుకోకూడదు అన్నారు.. మరి కాలితో తొక్కుతున్నారు కదా? తప్పులేదా అనే సందేహం కొందరికి ఉంది. 


నిజమే..


అందుకే..


రామానుజాచార్యులు కూడా తిరుమల కొండెక్కుతూ మోకాళ్లపర్వతం దగ్గర మోకాలితో పైకెక్కారు. ఆ పక్కనే రామానుజాచార్యుల ఆలయం ఉంటుంది. 


మరి సాధారణ తిరుమలేశుడి భక్తులంతా మోకాళ్లతో కొండెక్కలేరు కదా?


Also Read: అక్షర శరీరుడైన పరమేశ్వరుడి స్వరూపం గురించి మీకు తెలుసా!


ఇలాంటి వారికోసమే స్కాంద పురాణంలో మూడు శ్లోకాలున్నాయి. వీటిని పఠించి కొండెక్కితే సాలగ్రామ శిలను తొక్కిన దోషం ఉండదని చెబుతారు పండితులు.  


బ్రహ్మాదయోపి యం దేవాః సేవంతే శ్రద్ధయా సహ
తం భవంతమహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమ


క్షమస్వ తదఘం మేద్య దయయా పాతచేతసః
తన్ మూర్థని కృతావాసం మాధవం దర్శయస్వ మే


ప్రార్థయిత్వా నరస్త్యేవం వేంకటాద్రిం నగోత్తమం
తతో మృదుపదం గచ్ఛేత్ పావనం వేంకాటచలం


ఓ వెంకటాచలమా నువ్వు చాలా పవిత్రమైన కొండవి..బ్రహ్మాది దేవతలంతా నిన్ను పూజిస్తున్నారు. ఇప్పుడు నీపై పాదం మోపుతున్నాను.  అందుకు నన్ను క్షమించు. నిన్ను తొక్కుతూ వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే...శ్రీ వేంకటేశ్వరుడిని నీ శిరస్సుపై ఉంచావు. అక్కడివరకూ వెళ్లి భగవంతుడిని చేరుకోవాలంటే నీపైనుంచి నడిచి వెళ్లడం తప్పడం లేదు. అందుకే నన్ను క్షమించు అని అర్థం..


Also Read: విష్ణువుకే కాదు శివుడుకీ దశావతారాలున్నాయి - అవేంటంటే!


తిరుపతి కొండెక్కుతూ ఉంటే అలిపిరి (ALIPIRI METTU TIRUMALA ) నడకమార్గం మొదలయ్యే దగ్గర రెండు విగ్రహాలు సాస్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తాయి. అక్కడ నిల్చుని ఈ మూడు శ్లోకాలు చదువుకుని నడక ప్రారంభించాలి. అలిపిరి కాకుండా శ్రీవారి మెట్టు (Srivari Mettu ) మార్గంలో కొండెక్కినా ఆరంభంలో ఈ శ్లోకాలు చదువుకుని కొండెక్కడం ప్రారంభాలి.


అయితే ఎంత మందికి ఈ విషయం తెలుసు? ఎంతమంది చదవగలరు అంటే..తెలిసిన వాళ్లు, చదువుకోగలిగిన వాళ్లు తప్పుకోండి. లేదంటే కొండెక్కే ముందు ఆ సాష్టాంగ విగ్రహాల్లా వెంకటాచలానికి నమస్కారం చేసి..క్షమించమని ప్రార్థించి.. మనసునిండా భగవంతుడిని నిలుపుకుని అడుగులు ముందుకువేయండి. ఈ శ్లోకాలు చదవకపోతే దోషం వెంటాడుతుందనే భయం వద్దు. భక్తితో వేసే ప్రతి అడుగు భగవంతుడి సన్నిధికి చేరుస్తుంది..మోక్షానికి మార్గం చూపిస్తుంది..


ఓం నమో వేంకటేశాయ (Om Namo Venkatesaya)


Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!