Bathukamma Songs: బతుకమ్మ అంటేనే జానపద పాటల పండుగ. ఈ పండుగలో పల్లె పదాలు కనిపిస్తాయి, పల్లె జీవనం ప్రతిబింబిస్తుంది, పురాణాలకు చెందిన కథలు, అమ్మవారిని కొలుస్తూ పాడే పాటలు వినసొంపుగా ఉంటాయి. వీటితో పాటు అప్పటి స్త్రీల జీవనం గురించి చెబుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...శివుని రాక గురించి వేచి చూస్తూ “ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయె చందమామ..”పాడుతారు. వీటితో పాటూ పూర్వ కాలంలో రాజుల కథలు, అత్తగారింట్లో అమ్మాయిలు ఎలా ఉండాలి.. పిల్లలను ఎలా పెంచాలి వంటి వాటన్నింటినీ పాటల రూపంలో పాడుతుంటారు. కొన్ని పాటలు మీకోసం..


Also Read:  ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ, ప్రకృతిని ఆటపాటలతో పూజించే 'బతుకమ్మ' వెనుక ఎన్ని కథలో!


1. రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..
రామ రామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో..
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో..
పాపిటలో చంద్రుడా ఉయ్యాలో బలాకుమరుడా ఉయ్యాలో..


పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాసము ఉయ్యాలో..
బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో..
తెల్ల తెల్లయి గుళ్లు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..
పన్నెండేండ్ల కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్లు ఉయ్యాలో..


తెల్లయి వేములవాడ ఉయ్యాలో రాజన్న గుళ్లు ఉయ్యాలో..
నల్ల నల్లయి గుళ్లు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..
నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్లు ఉయ్యాలో..
పచ్చ పచ్చయి గుల్లు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్లు ఉయ్యాలో..


పచ్చయి పరకాన ఉయ్యాలో మల్లన్న గుల్లు ఉయ్యాలో..
పర్వతాల మల్లన ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో..
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో...


Also Read: బతుకమ్మ ఎన్నిరోజుల పండుగ, ఏ రోజు ఏ బతుకమ్మని పూజిస్తారు!


2. ఒక్కేసి పూవ్వేసి చందమామ..ఒక్క జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ..శివుడు రాకాపాయే చందమామ
రెండేసి పూలేసి చందమామ..రెండు జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ..శివుడు రాకాపాయే చందమామ
మూడేసి పూలేసి చందమామ..మూడు జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ...శివుడు రాకాపాయే చందమామ
నాలుగేసి పూలేసి చందమామ..నాలుగు జాములాయె చందమామ
శివపూజ వేలాయె చందమామ..శివుడు రాకాపాయే చందమామ
ఐదేసి పూలేసి చందమామ..ఐదు జాములాయె చందమామ
శివపూజ వేలాయె చందమామ..శివుడొచ్చి కూర్చునే చందమామ


3.తంగేడు పువ్వోప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే


తంగేడు పువ్వులో తంగేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 


ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
తెలుగంటి పువ్వోప్పునే గౌరమ్మ తెలుగంటి కాయప్పునే
తెలుగంటి పువ్వులో తెలుగంటి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 


ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునే
ఉమ్మెత్త పువ్వులో ఉమ్మెత్త కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 


ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
జిల్లేడు పువ్వోప్పునే గౌరమ్మ జిల్లేడు కాయప్పునే
జిల్లేడు పువ్వులో జిల్లేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 


ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
మందార పువ్వోప్పునే గౌరమ్మ మందార కాయప్పునే
మందార పువ్వులో మందార కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 


ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
గుమ్మడి పువ్వోప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే
గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 


ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
గన్నేరు పువ్వోప్పునే గౌరమ్మ.. గన్నేరు కాయప్పునే
గన్నేరు పువ్వులో గన్నేరు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 


4. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 


రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే
రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 


వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే
వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 


బంగారు బింద తీసుక బామ్మా నీళ్లకు వోతే
భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 


పగిడి బింద తీసుక పడతి నీళ్లకు వోతే
పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 


ముత్యాల బింద తీసుక ముదిత నీళ్లకు వోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 


5.శుక్రవారమునాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో
శుక్రవారమునాడు ఉయ్యాలో..చన్నీటి జలకాలు ఉయ్యాలో
ముత్యమంత పసుపు ఉయ్యాలో..పగడమంత పసుపు ఉయ్యాలో
చింతాకుపట్టుచీర ఉయ్యాలో..మైదాకు పట్టుచీరు ఉయ్యాలో
పచ్చపట్టుచీర ఉయ్యాలో..ఎర్రపట్టుచీర ఉయ్యాలో
కురుసబొమ్మల నడుమ ఉయ్యాలో..భారీ బొమ్మల నడుమ ఉయ్యాలో
గోరంట పువ్వుల ఉయ్యాలో..బీరాయిపువ్వుల ఉయ్యాలో
రావెరావె గౌరమ్మ ఉయ్యాలో..లేచెనే గౌరమ్మ ఉయ్యాలో
అడెనే గౌరమ్మ ఉయ్యాలో..ముఖమంత పూసింది ఉయ్యాలో
పాదమంత పూసింది ఉయ్యాలో..చింగులు మెరియంగ ఉయ్యాలో
మడిమల్లు మెరియంగ ఉయ్యాలో..పక్కలు మెరియంగ ఉయ్యాలో
ఎముకలు మెరియంగ ఉయ్యాలో..కుంకుమబొట్టు ఉయ్యాలో
బంగారు బొట్టు ఉయ్యాలో..కొడుకు నెత్తుకోని ఉయ్యాలో
బిడ్డ నెత్తుకోని ఉయ్యాలో..మా యింటి దనుక ఉయ్యాలో