Ayodhya Ram Mandir inauguration : దేశంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో వేర్వేరు వంటకాలను ప్రసాదంగా అందజేస్తుంటారు. ప్రసాదం కోసమే ఆలయాలకు వచ్చే భక్తులూ ఉంటారు. నిత్యం తినే వంటకం కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ప్రత్యేక రుచి ఏర్పడుతుంది. అందుకే ఆలయాల్లో ప్రసాదాలు అంత ప్రత్యేకం. వాటిని కొనుగోలు చేసి భక్తులు అందరకీ పంచిపెడుతుంటారు. మరి అయోధ్యలో ప్రసాదం ఏంటి? దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Also Read: అయోధ్యలో అతిపెద్ద దీపం 'దశరథ్ దీప్' ఎప్పుడు వెలిగిస్తారంటే!
ప్రసాదం ప్రత్యేకం
దేవాలయాల్లో ప్రసాదానికి ప్రత్యేకత ఉంటుంది. పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో ఏకంగా 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అక్కడ నైవేద్యాల తయారీ నుంచి రుచి వరకూ అన్నీ ప్రత్యేకతమే. తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక అన్నవరం గోధుమరవ్వతో చేసే ప్రసాదం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పులిహోర, శబరిమల అయ్యప్ప అరవణ పాయసం ప్రసాదం, షిర్డీలో దూద్ పేడా, శ్రీకృష్ణ దేవాలయాలలో మఖన్ మిశ్రీ, మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి పరిమళ ప్రసాదం, బాసర సరస్వతీ ఆలయంలో పరమాన్నం...ఇలా దేనికదే ప్రత్యేకమైన రుచి. అసలు దేవుడికి నైవేద్యం పెడితేనే వంటకం రుచే మారిపోతుందంటారు. మరి రాఘవుడు కొలువుతీరిన అయోధ్యలో భక్తులకు ఏం ప్రసాదం ఇస్తున్నారో తెలుసా..ఇలాచీ దానా...
Also Read: సీతమ్మను అడవుల్లో వదిలేసిన రాముడి ప్రతి అడుగు ఆదర్శనీయం ఎలా అవుతుంది!
ఇలాచీ దానా ప్రసాదం
శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత రోజు నుంచి దర్శనం కోసం భక్తులను అనుమతించనున్నారు. అయితే రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం విషయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో ప్రసాదంగా ఇలాచీదానా అందించాలని ట్రస్టు నిర్ణయించింది. ఇది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని అంటున్నారు. పంచదార, ఏలకులతో తయారుచేసే ఇలాచీదానాను ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. దీంతో ఈ ప్రసాదం తయారీ బాధ్యతను రామ్‌విలాస్ అండ్ సన్స్ దుకాణానికి రామజన్మభూమి ట్రస్ట్ అప్పగించింది. ఇప్పటికే దాదాపు 5 లక్షల ఇలాచీదానా ప్రసాదం ప్యాకెట్లు సిద్ధంచేశారు.
Also Read: 'రామ' ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్!
ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
యాలకుల గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం సహా పలు ఔషద గుణాలు ఉండడం వల్ల ఉదర సంబంధిత సమస్యలకు చక్కని పరిష్కారం అంటారు ఆరోగ్య నిపుణులు. కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఏలకుల పొడిచేసుకుని చిన్న గ్లాసులో సగం నీళ్లు తీసుకుని ఉడకబెట్టాలి. పిల్లలలో జలుబుకి యాలకులు మంచి ఔషధంగా చెప్పవచ్చు. నాలుగు లేదా ఐదు యాలకులు నిప్పులపై వేసి ఆ పొగను పీల్చినట్లయితే ముక్కు కారటం తగ్గుతుంది. అధిక సూర్యరశ్మిలో తిరిగినప్పుడు వచ్చే తలనొప్పి తగ్గేందుకు ఏలకుల కషాయం తాగడం మంచిది. డిప్రెషన్ ఉన్నవారు 'ఏలకుల టీ' తాగితే సాధారణ స్థితికి వస్తారు. తక్కువ టీ పౌడర్, ఎక్కువ ఏలకులు టీని కలిపి తీసుకుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఏలకులను పంచదారతో కలపి అయోధ్య రామభక్తులకు ప్రసాదంగా అందించనున్నారు...
Also Read: మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక - శుభ స్వాగతం ప్రియ పరిపాలకా!