Ayodhya Ram Mandir inauguration : అంతా రామమయం...ఈ జగమంతా రామమయం. అయోధ్యలోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదమే. రామనామజపమే. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మికశోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు.. రంగురంగుల విద్యుద్దీపాలు, పూలతో ద్వారాల అలంకరణ, రంగవల్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్య నగరంవ చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదు. యావత్‌దేశం వేచిచూస్తోన్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ఈ వేడుక కోసం ఇప్పటికే ఆహ్వానితులు అయోధ్యకు చేరుకున్నారు. రామ్ లల్లా విగ్రహప్రతిష్టాపన సందర్భంగా అయోధ్యలో అడుగడుగునా ప్రత్యేకతలే. అందులో ఒకటి దశరథ్ దీప్... అయోధ్యలో వెలగనున్న అతిపెద్ద దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తారంటే...
Also Read: సీతమ్మను అడవుల్లో వదిలేసిన రాముడి ప్రతి అడుగు ఆదర్శనీయం ఎలా అవుతుంది!
అయోధ్యలో అతిపెద్ద దీపం
28 మీటర్ల పొడవు - వెడల్పు ఉన్న ఈ దీపాన్ని వెలిగించేందుకు 21 క్వింటాళ్ళ నూనె అవసరమవుతోంది. ఈ దీపం ఘనతను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రతువుకు 'దశరథ్ దీప్'గా నామకరణం చేసిన ఆలయ ట్రస్ట్, దీపపాత్ర తయారీకి 100 పుణ్యక్షేత్రాల్లోని మట్టితో పాటు నదులు, సముద్రాల నుంచి పుణ్య జలాలు సేకరించారు. పాకిస్థాన్‌కు చెందిన హీంగ్లాజ్ నుంచి, నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి కూడా మట్టిని తెప్పించారు. పురాణాలను అధ్యయనం చేసి...త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమిద తయారీ కోసం 108 మంది కళాకారులు శ్రమిస్తుండగా...7 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. దీపం వత్తి తయారీకి 1.25 క్వింటాళ్ళ పత్తిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీపం తయారీకి వినియోగించే అధునాతన యంత్రం కోల్‌కతా నుంచి తెప్పించారు.
ట్రస్ట్ సభ్యులు సాయంత్రం 6 గంటలకు ఈ దీపం వెలిగించనున్నారు
Also Read: 'రామ' ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్!
సోమవారం సాయంత్రం 10 లక్షల దీపాలు
బాల రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని సోమవారం (22న) సాయంత్రం అయోధ్య నగరంలో 10లక్షల మట్టి దీపాలు వెలిగించనున్నారు. నగరంలోని 100 ఆలయాలతో పాటు ఇతర ప్రధాన కూడళ్లను దీపాలతో అలంకరిస్తామని ట్రస్టు అధికారులు వెల్లడించారు. రామమందిరం సహా నగరంలో ఉన్న రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తార్ ఘాట్, సరయు ఘాట్, లతామంగేష్కర్ చౌక్, మణిరాం దాస్ ఛవని తదితర ప్రాంతాలు, దాదాపు వెయ్యి ఆలయాలు ఈ దీపాల కాంతులతో వెలిగిపోనున్నాయి. ఈ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ సర్కారు నిర్వహిస్తోంది.
Also Read: మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక - శుభ స్వాగతం ప్రియ పరిపాలకా!
మంగళవారం నుంచి సాధారణ భక్తులకు అనుమతి
అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా క్రతువుల్లో 121మంది ఆచార్యులు పాల్గొంటున్నారు. అయోధ్యలో నిర్మిస్తున్నరామమందిర నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.1,100 కోట్లకు పైగా ఖర్చయిందని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి తెలిపారు. పాత రామ్‌లల్లా విగ్రహం ఐదారు అంగుళాలు మాత్రమే ఎత్తు ఉండటంతో 25-30 అడుగుల దూరం నుంచి దర్శించుకోవడానికి భక్తులకు సాధ్యం కాదని.. అందుకే పెద్ద విగ్రహం ప్రతిష్ఠిస్తున్నామని ఆయన వివరించారు. ఇక, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక, మంగళవారం నుంచి బాలరాముడు సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.
Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి!