The alluring qualities of Lord Rama: ఓ సందర్భంలో నారదుడు-  వాల్మీకి మధ్య ఓ చర్చ జరిగింది


వాల్మీకి మహర్షి ప్రశ్న
నిత్యం సత్యం పలికే వాడు, నిరతము ధర్మం నిలిపే వాడు, చేసిన మేలు మరువని వాడు, సూర్యునివలనే వెలిగే వాడు, ఎల్లరికి చలచల్లని వాడు, ఎదనిండా దయగల వాడు...సరియగునడవడివాడు...ఈ లోకంలో ఎవరున్నారు


నారద మహర్షి సమాధానం
ఈ ప్రశ్నలన్నింటికీ   చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రుడు. 
ఓం కారానికి సరి జోడు, జగములు పొగిడే మొనగాడు, విలువులు కలిగిన విలుకాడు, పలుసుగుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు..దశరధ తనయుడు దానవ దమనుడు జానకిరాముడు...అతడే శ్రీరాముడు శ్రీరాముడు అని సమాధానం ఇచ్చాడు. 


శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం.. దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవరూపంలో అవతరించి, ధర్మ సంస్థాపన చేసిన అవతారం ఇది. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నంలో జన్మించాడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య కోసం పరతపించిన భర్తగా, ఆదర్శవంతమైన తనయుడిగా ఇలా సకల సుగుణాలు కలబోసిన రామయ్యలో షోడస (16) గుణాలను ప్రత్యేకంగా చెబుతారు. ఆ సుగుణాలు ఇవే... 


కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ||


చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ||


ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః |
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||


Also Read: విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు - ఓ రాయి దేవుడిగా ఎలా మారుతుంది!


గుణవంతుడు,  వీర్యవంతుడు , ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు
సత్యం పలికేవాడు,  దృఢమైన సంకల్పం కలిగినవాడు, వేద వేదాంతాలను తెలిసివాడు
అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు
ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందగాడు, ధైర్యవంతుడు
క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు
అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు...


ఈ 16 సుగుణాలే శ్రీరాముడిని ఆదర్శ పురుషుడిగా నిలబెట్టాయి.  


శ్రీరాముడు మానవుడిగా జన్మించాడు..ఎక్కడా దైవత్వం చూపించకుండా మానవుడిలానే పెరిగాడు.. జీవితంలో ఓ మనిషి ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని ఎదుర్కొన్నాడు..కానీ ఎక్కడా తొణకలేదు, ధర్మాన్ని వీడలేదు, అసత్యం చెప్పలేదు. సరిగ్గా గమనిస్తే శ్రీ మహవిష్ణువు  దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే  రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే.  అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించలేదు( కృష్ణావతారంలో తానే భగవంతుడిని అని చెబుతాడు కృష్ణుడు) . “రామస్య ఆయనం రామాయణం” అంటారు కదా మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది. అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం . సాధారణ మానవుడిలా జన్మించి..చివరకు మానవుడిలానే అవతార పరిసమాప్తి చేశాడు. అందుకే రాముడి ప్రతి అడుగు ఆదర్శం...రాముడే ఆదర్శ పురుషుడు...


Also Read: భరతుడు వచ్చి పిలిచినా రాముడు అయోధ్యకు ఎందుకు వెళ్లలేదు!