నాగదోష పరిహారార్థం నిర్మించిన ఆలయం
చోళ రాజులు నిర్మించిన ఆలయం ఇది. చోళ తిక్కన అల్లుడైన తిరుక్కాళ మహారాజుకి నాగదోషం ఉండటం వల్ల దాని పరిహారం కోసం ఈ ఆలయం నిర్మించారు. నెల్లూరు జిల్లా, ఆత్మకూరు పట్టణంలో ఉన్న ఇది అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటి. 1247లో చోళ రాజుల కాలంలో అలఘనాథ స్వామి దీనిని నిర్మించారు. చోళరాజుల ఆధిపత్యం తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు దీన్ని పునర్నిర్మించారని చెబుతారు. ఆ తర్వాత కొన్నేళ్లకు శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ సహకారంతో గ్రామస్తులు తిరిగి నిర్మించారు.ఆలయ స్తంభాలపై దశావతారాల నమూనాలు అద్భుతంగా ఉంటాయి. తమిళనాడు రాష్ట్రం కంచి ఆలయంలో బంగారు బల్లి ఉన్నట్టే ఇక్కడ కూడా అలఖనాథుడి ఆలయంలో కూడా బంగారుబల్లి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించినా బల్లి పడిన దోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. విష్ణు అంశగా వెలసిన అలఘనాథుడి పురాతన విగ్రహాల స్థానంలో టీటీడీ చేసిన విగ్రహాలు ఉంచి పూజలు చేస్తున్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణ సమయంలో ఎన్నో మహిమలు జరిగాయంటారు స్థానికులు.


Also Read: అమ్మవారికి ఆషాడమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు, అసలు బోనం అంటే ఏంటి!


ఆంజనేయుడి విగ్రహ చరిత్ర..
అలఘనాథ స్వామి ఆలయంలోని ఆంజనేయ విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. అప్పుడెప్పుడో ప్రతిష్టించిన ఆంజనేయ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. దీంతో అదంతా దేవుడి లీలగా భావిచి పాత విగ్రహాన్నే అక్కడ ఉంచేశారు. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే కాళ్లకు బంధనం కట్టినట్టు ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయుడి చేతికి బంధనం ఉంటుంది...అందుకే ఆయన్ను బేడి ఆంజనేయ స్వామి అంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయుడి కాళ్లకు బంధనం ఉంటుంది. హనుమంతుడి తల్లి ఆయన కాళ్లకు బంధనం కట్టినట్టు చెబుతుంటారు.



ఇదొక్కటే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెన్నా పరివాహక ప్రాంతంలో ఎన్నో విశిష్టమైన ఆలయాలున్నాయి. నెల్లూరులోని రంగనాథుడి ఆలయం జిల్లాకే తలమానికం. ఆత్మకూరులోని అలఘ నాథుడి ఆలయంలో ఏటా మార్చి, ఎప్రిల్ నెలల్లో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. నాగదోష పరిహారార్థం భక్తులు ఇక్కడ పూజలు చేస్తుంటారు. 


Also Read:  జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!


హనుమాన్ జయమంత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||