Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో గేమ్ ఛేంజర్ మూవీతో రాబోతున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో మూవీకి కమిటయ్యారు. ప్రస్తుతం అయ్యప్పమాలలో ఉన్న రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించుకున్నారు. సాధారణంగా దర్గాను దర్శించుకోవడం తప్పులేదు కానీ అయ్యప్పమాలలో ఉండి వెళ్లడం ఏంటనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
దర్గా అంటే ఓ సమాధి.. సమాధిని సందర్శించి వస్తే మాల తీసేయాలి కదా అంటున్నాయి పలు హిందూ సంఘాలు. ఇదే సమయంలో శబరిమలలో ఉన్న వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి గురించి కూడా ప్రస్తావన వస్తోంది. నేరుగా అయ్యప్ప సన్నిధిలోనే లేని తప్పు ఇక్కడేంటని క్వశ్చన్ చేస్తున్నారు మరికొందరు భక్తులు.
శబరిమల వెళ్లే భక్తులు ఎరుమేలిలో పేటతుళ్లై ఆడిన తర్వాత వావర్ స్వామిని దర్శించుకుంటారు. అయితే వావర్ స్వామి అనేది కూడా ఓ కట్టు కథ..కేవలం హిందూ భక్తులను తప్పుదారి పట్టించేందుకు కొందరు క్రియేట్ చేశారంటారు మరికొందరు.
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!
ఇంతకీ ఎవరీ వావర్ స్వామి
పురాణాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం వావర్ యుద్ధ విద్యలో నైపుణ్యం కలవాడు. ఓసారి అయ్యప్పతో మూడు రోజుల పాటూ యుద్ధం చేసి సమఉజ్జీగా నిలిచాడు. అప్పుడు అయ్యప్ప తన చేతిలో ఆయుధం కింద పడేసి..వావర్ ని ఆలింగనం చేసుకుని స్నేహితుడిగా మార్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో వావర్ అయ్యప్పకు ముఖ్యమైన శిష్యుడిగా మారాడని చెబుతారు. తన బాణం పడిన చోట ఆలయం నిర్మించాలని చెప్పిన అయ్యప్ప.. ఆ సమీపంలోనే వావర్ కి మసీదు కూడా కట్టాలని చెప్పాడట. ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం అక్కడ విగ్రహ ప్రతిష్ట జరగలేదు కానీ వావర్ ఉనికిని సూచిస్తూ ఓ శిల ఉంటుంది. ఈ మసీదులో శబరిమలకు వెళ్లే భక్తులు మాత్రమే కాదు వేలాది హిందువులు పూజలు చేస్తారు. ఈ సంప్రదాయం 500 ఏళ్ల నుంచి కొనసాగుతోందని చెబుతారు. కొట్టాయం జిల్లా ఎరుమేలి దగ్గర ఈ మసీదు ఉంటుంది. ఈ ప్రాంతంలోనే అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసుడిని సంహరించినట్టు పురాణాల్లో ఉంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఈ ప్రాంతంలోనే పేటతుళ్లి ఆడతారు. అనంతరం మసీదుకి వెళ్లి అగరుబత్తి వెలిగిస్తారు. శబరిమలకు వెళ్లేముందు చాలామంది భక్తులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు.
Also Read: ఇరుముడి అంటే ఏంటి, అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడి ఎందుకు!
అయ్యప్ప మాలలో ఉండగా దర్గాకి వెళ్లొచ్చా?
వావర్ స్వామి కొలువైన మసీదుని దర్శించుకుని అయ్యప్పను దర్శించుకుంటారు..అందుకే రామ్ చరణ్ అయ్యప్పమాలలో దర్గాకి వెళ్లడంలో తప్పులేదంటారు కొందరు పండితులు. మరి వివాదం ఎందుకంటే..దర్గా అనగానే సమాధి కదా? సాధారణంగా అయ్యప్ప మాల వేసుకున్నవారు చావు వార్త వినరు, ఆ ప్రదేశానికి వెళ్లరు. ఇంట్లో స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు కూడా కనీసం ఎదురుపడరు. మండల దీక్షను అంత నియమంగా చేస్తారు కదా..అలాంటప్పుడు దర్గాకు వెళ్లడం తప్పుకాదా అన్నది కొందరి వాదన. అయితే రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్లిన సందర్భం ఏంటంటే ఉరుసు ఉత్సవాలు. పేరులోనే ఉత్సవం అని ఉంది అంటే అది శుభమే కానీ ఎంతమాత్రం అశుభం కానేకాదు.అలాంటప్పుడు దర్గాని సందర్శించడం, ఉత్సవాల్లో పాల్గొనడం అస్సలు తప్పులేదంటారు. ఇప్పటికీ ఈ విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి.. మరి రామ చరణ్ ఏమంటారో చూడాలి...
అయ్యప్ప మాల వేసుకోవడం , ఆ నియమాలు పాటించడం వెనుకున్న ఆంతర్యం ఏంటంటే..ఆరోగ్యం, మానసిక పరివర్తన కోసమే అని చెబుతారు... మిగిలిన నమ్మకాలన్నీ ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదే...
గమనిక: ఇవన్నీ కొందరు పండితులతో చర్చించిన విషయాలే కానీ..వీటిని ABP దేశం ధృవీకరించడం లేదు. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.