Travancore Devaswom Board Sabarimala Ayyappa Darshanam: డిసెంబరు 26 వరకూ రెండు నెలల పాటూ మండల మకరువిళక్కు పూజలో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. రెగ్యులర్ టైమ్ కన్నా ఓ గంట ముందే ఆలయం తెరిచి ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు.
అయ్యప్ప స్వామి దర్శనార్థం భారీగా భక్తులు శబరిమల చేరుకున్నారు. అయితే గతేడాది అయ్యప్ప దర్శనానికి వెళ్లిన భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూ లైన్లు నిర్వహించడం, భక్తులందరకీ దర్శనం కల్పించడంలో దేవస్థానం చాలా విమర్శలు ఎదుర్కొంది. అందుకే ఈ ఏడాది ఆ పొరపాట్లు రిపీట్ కాకూడదని నిర్ణయించుకుంది ట్రావెన్స్ కోర్ దేవస్థానం
భారీగా తరలివచ్చిన భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పోలీస్ చీఫ్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్.శ్రీజిత్ ఈ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గతేడాది పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు
Also Read: అయ్యప్ప మాల వేసిన స్వాములకు బిగ్ అలర్ట్- ఇలా చేస్తే దేవుని దర్శనం మరింత సులభం
గతేడాది సరైన శిక్షణ లేని పోలీసులను అక్కడ నియమించడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పలేదని భావించిన ఏడీజీపీ శ్రీజిత్ .. ఈ సంవత్సరం పదునెట్టాంబడి వద్ద విధులు నిర్వర్తించేందుకు ఆసక్తిగా ఉన్న పోలీసులకు ముందుగా శిక్షణ ఇచ్చారు. అందులే గతేడాది స్వామివారి 18 మెట్లు నిముషానికి మ్యాగ్జిమం 60 మందికి మాత్రమే అనుమతి ఉండేది.. ఈ ఏడాది ఆ సంఖ్య మరో 20 పెరిగింది. నిముషానికి 80 నుంచి 90 మంది భక్తులు పదునెట్టాంబడి ఎక్కుతున్నారు.
అయ్యప్ప ఆలయం తెరిచిన నాలుగు రోజుల్లోనే దాదాపు 2 లక్షల 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గడిచిన సీజన్లతో పోల్చితే ఈ సీజన్లో దర్శనం సమయం పొడిగించారు. రోజూ తెల్లవారు జామున 3 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ...మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 11 గంటల వరకూ 18 గంటల పాటూ అయ్యప్ప దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు.
స్వామి దర్శనార్థం వచ్చే మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. వలియ నడపంతల్ నుంచి ప్రారంభమయ్యే ఈ క్యూ లైన్ ద్వారా డైరెక్ట్ గా పదునెట్టాంబడికి చేరుకునేలా ఏర్పాటు చేశారు. చిన్నారులు, వృద్ధులకు తోడుగా ఒకర్ని అనుమతిస్తారు..
Also Read: ఇరుముడి అంటే ఏంటి, అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడి ఎందుకు!
మరోవైపు శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొదటి దశలో భాగంగా నిలక్కల్ నుంచి పంపా మధ్య 383 బస్సులు నడుపుతోంది. మరో 192 బస్సులు సిద్ధంగా ఉన్నాయ్...రెండో దశలో ఈ బస్సల సంఖ్య 550కి పెంచుతూ..భక్తుల రద్దీ ఆధారంగా మార్పులుంటాయని KSRTC పేర్కొంది.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి..