US DOJ To Call For Google To Sell Chrome Browser: క్రోమ్ బ్రౌజర్‌ను వినియోగించుకొని గుత్తాధిపత్యంతో గూగుల్‌ తన ఆదాయాన్ని పెంచుకుంటోందని అమెరికా న్యాయశాఖ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దీన్ని అమ్మేలా గూగుల్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ మేరకు రేపు కోర్టుకు కీలక సిఫార్సులు చేయనుంది. ఇప్పటికే గూగుల్‌కు వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఈ సిఫార్సులు వాటికి జత అయితే పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. 


క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మేయాలంటూ ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ కంపెనీ అయిన గూగుల్‌పై అమెరికా ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ మేరకు న్యాయశాఖలోని యాంటీ ట్రస్ట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెర్చ్ ఇంజిన్ మార్కెట్‌పై గూగుల్ గుత్తాధిపత్యం చెలాయిస్తోందని ఇది మంచిది కాదని ఫెడరల్ కోర్టుకు కీలక సిఫార్సులు చేయబోతున్నారని సమాచారం.  


Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!


ఈ కేసులు వేసిన రాష్ట్రాలతోపాటు న్యాయాధికారులు కూడా ఇందులో భాగం కావాలని నిర్ణయానికి వచ్చారు. గతంలో తీర్పు వెల్లడించిన జడ్జి అమిత్ మెహతాకు కీలక సిఫార్సులు చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను మెహతా అంగీకరిస్తే ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌,  ఏఐ పరిశ్రమ తిరిగి పునర్నిర్మాణానికి లోనయ్యే అవకాశం ఉంది. 


ట్రంప్ పరిపాలన కాలంలో ఈ కేసు దాఖలైంది. తర్వాత జో బైడెన్ హయాంలో కూడా విచారణ కొనసాగింది. రెండు దశాబ్దాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్‌ను విచ్ఛిన్నం చేయడానికి యత్నించి విఫలమైనప్పటి నుంచి ఈ దిగ్గజ టెక్నాలజీ కంపెనీని నియంత్రించడానికి వాషింగ్టన్ దూకుడు ప్రయత్నిస్తూనే ఉంది. 


వెబ్ బ్రౌజర్‌ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ వల్ల గూగుల్‌ యాడ్స్‌ బిజినెస్‌కు కీలకంగా మారుతోంది. ఒకసారి సైన్ ఇన్ అయిన వినియోగదారుల యాక్టివిటీని క్రోమ్ పరిశీలిస్తోంది. ఆ డేటా ఆధారంగానే వారికి కావాల్సినవి ప్రమోట్ చేస్తూ లక్ష్యాలు చేరుకుంటుంది. భారీగా ఆదాయం సంపాదిస్తోంది. గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ ఏఐ మోడల్ అయిన జెమినికి వినియోగదారులను మళ్లించడానికి క్రోమ్‌ని ఉపయోగిస్తోంది.



ఈ వివాదంపై గూగుల్ రెగ్యులేటరీ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ లీ-అన్నే ముల్హోలాండ్ స్పందిస్తూ "ఈ కేసులో చట్టపరమైన సమస్యలకు మించిన రాడికల్ ఎజెండాను న్యాయశాఖ ముందుకు తీసుకువెళుతోంది" అని అన్నారు. "ప్రభుత్వం ఇలా చేయడం వల్ల వినియోగదారులకు, డెవలపర్లకు, అమెరికన్ టెక్‌ దిగ్గజాలకు హాని చేస్తుంది" అని ఆమె అన్నారు. దీనిపై స్పందించేందుకు న్యాయ శాఖ నిరాకరించింది.


ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న బ్రౌజర్ క్రోమ్‌ను అమ్మేయాలని గూగుల్‌ను ఆదేశించాలని యాంటీట్రస్ట్ అధికారులు కోరనున్నారు. ఎందుకంటే ఇది చాలా మంది వాడే సెర్చ్ ఇంజిన్‌ అని.. కీలక యాక్సెస్ పాయింట్‌ అని చెబుతున్నారు. అమెరికాలోనే దాదాపు 60 శాతానికిపైగా వినియోగదారులు ఈ క్రోమ్‌ వాడుతున్నారు. అందుకే పోటీ మార్కెట్‌ను సృష్టిస్తే ఆ తర్వాత క్రోమ్‌ను ఏం చేయాలనే విషయంపై నిర్ణయించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అధికారులు గత మూడు నెలలుగా డజన్ల కొద్దీ కంపెనీలతో సమావేశమై దీనికి సంబంధించిన సిఫార్సులు సిద్ధం చేశారు. ఒకానొక దశలో గూగుల్ ఆండ్రాయిడ్‌ను కూడా అమ్మేయాలని సిపార్సు చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని క్రోమ్ వరకే పరిమితం చేశారు. 


Also Read: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!