Chandrababu Naidu 2 Years Rule Protests:   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయి అప్పుడే రెండేళ్లు  పూర్తయింది. కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో సాంకేతికంగా ఆయనకు  ప్రధాన ప్రతిపక్ష హోదా  దక్కలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఏకైక బలమైన విపక్ష నేత ఆయనే. అయితే, ఈ రెండేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన పంథా రాజకీయ వర్గాలను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, ప్రజల్లోకి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితం కావడం వల్ల.. ఆయన ఒక ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారనే బలమైన అభిప్రాయం సొంత క్యాడర్‌తో పాటు సామాన్య ప్రజల్లోనూ వ్యక్తమైంది.

Continues below advertisement

వైసీపీ చుట్టూ కేసుల వల 

అదే సమయంలో క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇసుక, లిక్కర్ వంటి  స్కామ్‌ల దర్యాప్తు ముమ్మరం కావడం, వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు, కీలక నేతలను వరుస కేసులు వెంటాడుతుండటం పార్టీని తీవ్ర రక్షణ చట్రంలోకి నెట్టేసింది. అధినేత జగన్మోహన్ రెడ్డి కోటరీలోనే అంతర్గత విబేధాలు భగ్గుమనడం, మరోవైపు కుటుంబ పరంగా తల్లి, చెల్లితో నడుస్తున్న ఆస్తి తగాదాలు పొలిటికల్‌గా ఆయన నైతిక బలాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాలన్నింటి వల్లే జగన్మోహన్ రెడ్డి గత రెండేళ్లుగా ఒకరకమైన రాజకీయ వైరాగ్యంలో ఉండిపోయారని, అందుకే ప్రజాపోరాటాలను ‘లైట్’ తీసుకున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.

Continues below advertisement

ఇప్పుడు జగన్ తన పంథాను మార్చుకోక తప్పని పరిస్థితి

రాజకీయాల్లో ఎల్లకాలం ఒకే వ్యూహం వర్కవుట్ కాదు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం మాత్రమే ఉండటంతో.. జగన్ ఇప్పుడు తన పంథాను మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేవలం ఎన్నికల ముందు  పాదయాత్ర చేస్తే సరిపోతుందనే పాత ఫార్ములాను నమ్ముకుని, ఈ ఏడాది కూడా ఇలాగే మౌనంగా ఉంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే  ప్రమాదం ఉందని ఆయన లీగల్, పొలిటికల్ టీమ్స్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఈ రెండేళ్ల స్తబ్దతకు తెరదించుతూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే రోడ్డుపైకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

బాధితుల పరామర్శ కోసం విశాఖకు రాక 

 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి బుధవారం   వైజాగ్ పర్యటనకు వెళ్తుండటం ఈ వ్యూహాత్మక మార్పునకు సంకేతంగా కనిపిస్తోంది. అలాగే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా..  టూ ఇయర్స్ ఆఫ్ బెట్రాయల్  పేరుతో వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. బుక్‌లెట్లు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది.  జగన్మోహన్ రెడ్డి కేవలం ఇలాంటి అప్పుడప్పుడు చేసే పర్యటనలకే పరిమితం కాకుండా, నిరంతరం ప్రజల్లో ఉండేలా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కేసుల భయంతో వెనకడుగు వేస్తున్న నేతల్లో ధైర్యం నింపాలన్నా, క్షేత్రస్థాయిలో చెల్లాచెదురైన క్యాడర్‌ను ఏకం చేయాలన్నా అధినేత నిరంతరం రోడ్లపైనే ఉండాలి. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి గడప దాటి పూర్తిస్థాయి ప్రజాపోరాటాల్లోకి దిగుతారా? లేక పార్ట్ టైమ్ రాజకీయాలనే నమ్ముకుంటారా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.