Kolusu Parthasarathy News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...వలసలు జోరందుకుంటున్నాయి. వైసీపీ(YCP)లో ప్రాధాన్యత దక్కని నేతలు, టికెట్ రాని వారంతా...అధికార పార్టీకి రాం రాం అంటున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య(C Ramachandraiah), వంశీక్రిష్ణ యాదవ్ (Vamsi Krishna Yadav) తో పాటు ఎమ్మెల్యేలు జగన్ కు గుడ్ బై చెప్పారు. రామచంద్రయ్య టీడీపీలో చేరగా, వంశీక్రిష్ణ యాదవ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి చేరారు.


టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం నేత బొమ్మసాని సుబ్బారావు...పార్థసారథిని కలిశారు. ఆయన కార్యాలయంలోనే వెలగపూడి, బొమ్మసాని సుబ్బారావు... పార్థసారథితో చర్చలు జరిపారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో జరిగే రా కదలిరా బహిరంగసభలో...చంద్రబాబు సమక్షంలో పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  


సీఎం నచ్చజెప్పినా ససేమిరా
మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి పార్టీ మారుతారన్న ప్రచారంతో వైసీపీ హైకమాండ్ అలెర్ట్ అయింది. ఇప్పటికే పార్థసారథితో రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే కైలే సమావేశమై చర్చించారు. ఆ తర్వాత.. సీఎంవోకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు.  సారథి శిష్యుడుగా ఉన్నటువంటి కైలే ప్రస్తుతం పామర్రు ఎమ్మెల్యేగా ఉన్నారు. సారథి పార్టీ వీడితే తనకు కూడా ఇబ్బందులు వస్తాయని ఆందోళనతో కైలే అనిల్ ఉన్నట్టు లోకల్ టాక్. దీంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు. అయినప్పటికీ పార్థసారథి మెత్తబడలేదు.


జగన్ పై సుతిమెత్తగా విమర్శలు
కొంతకాలంగా వైసీపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు కొలుసు పార్థసారథి. ఇటీవల జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో తన ఆవేదన వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ గుర్తించకపోయినా...నియోజకవర్గం ప్రజలు మాత్రం తనను గుర్తించారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి గెలిపించారని అన్నారు. సీనియర్ నేత అయినప్పటికీ...తనకు మంత్రి పదవి దక్కలేదని సన్నిహితులు వద్ద వాపోయారు. వైసీీపీ అధిష్టానం తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని పార్థసారథి వాపోయినట్లు తెలుస్తోంది.


ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు మంత్రిగా బాధ్యతలు
పార్థసారథి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉయ్యూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్, వెటర్నరీ యూనివర్శిటీ శాఖల మంత్రిగా పని చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 2014లో ఓటమి పాలయిన పార్థసారథి...2019లో వైసీపీ అభ్యర్థిగా పెనమలూరు నుంచి పోటీ చేసి...టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పై 10వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 


Also Read: వైసీపీలోకి ఎంపీ కేశినేని నాని, సాయంత్రం సీఎం జగన్ ను కలిసే ఛాన్స్


Also Read: తూర్పు గోదావరి సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్