Razole Assembly constituency: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఒకటైన రాజోలు నియోజకవర్గం 2019 ఎన్నికల ఫలితాల్లో వార్తల్లో నిలిచింది. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన జనసేన పార్టీ రాష్ట్రంలో గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు.. పార్టీ అధినేత సైతం రెండు చోట్ల పోటీచేసి ఓటమి పాలైన పరిస్థితి ఉండగా నూతనంగా ఏర్పడ్డ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలులో మాత్రం ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.


ఏడాదికే రాపాక జంప్


గెలిచిన ఏడాది కాలంలోనే వైసీపీ వైపు వెళ్లిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతారని అంతా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జ్‌ల జాబితా విడుదల చేసిన వైసీపీ అధిష్టానం రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్‌ను ఇంకా నియమించలేదు.


జనసేన టికెట్ కోసం బంతు ప్రయత్నాలు


జనసేన పార్టీ గెలిచినా ఆపార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే పార్టీలో లేకపోవడంతో ఈసారి మళ్లీ పార్టీ జెండా ఎగరేలాయని కసిగా పనిచేయాలని సన్నద్ధమవుతున్నారు జనసైనికులు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకు సరైన నాయకుడు అక్కడ లేకపోవడం పెద్ద మైనస్‌గా చెప్పుకుంటున్నారు. అయితే రాపాక కుటుంబానికి చెందిన చింతలపూడి సర్పంచ్‌ డాక్టర్‌ రాపాక రమేష్‌ జనసేన పార్టీ కోసం పనిచేయడం,, వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చేసిన బంతు రాజేశ్వరరావు జనసేన టిక్కెట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


రాపాకను ఓడించడమే లక్ష్యంగా...
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన గెలిచిన రాపాక వరప్రసాదరావు వైపీపీ గూటికి చేరారు. రాష్ట్రంలో జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే స్థానం కావడంతో దీనికి స్థానిక జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈనేపథ్యంలనే రాబోయే ఎన్నికల్లో ఏది ఏమైనా జనసేన పార్టీను గెలిపించుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాయి. అయితే జనసేన పార్టీ విజయం వెనుక జనసేన ఓటు బ్యాంకుతోపాటు రాపాకకున్న ఓటు బ్యాంకు కారణమని, అంతేకానీ కేవలం జనసేనతోనే విజయం లభించలేదని చెబుతున్నారు. 


పవన్‌ వారాహి సభతో జోష్‌..
మొదటి దశ వారాహి యాత్ర సందర్భంగా మలికిపురంలో నిర్వహించిన బహిరంగ సభ రాజోలు జనసేన కేడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ చీకట్లో చిరుదీపంలా రాజోలు విజయం కనిపించిందని, ఇంతటి విజయాన్ని అందించిన రాజోలు నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 


మరింత బలాన్ని పెంచుకున్న టీడీపీ...
రాజోలు నియోజకవర్గంలో టీడీపీ తరపున నియోజకవర్గ ఇంచార్జ్‌గా సీనియర్‌ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపోందిన సూర్యారావు పార్టీకి మరింత బలాన్ని పెంచారు. ప్రస్తుతం రాజోలులో టీడీపీ కూడా మంచి పట్టున్న పరిస్థితే కనిపిస్తోంది. అయితే జనసేన, టీడీపీ పొత్తులో ఏ పార్టీ ఇక్కడి నుంచి పోటీచేస్తుందన్నది ఇంతవరకు క్లారిటీ లేకపోగా వారాహి యాత్ర టైంలో పవన కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఇక్కడి నుంచి జనసేన మాత్రమే పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 


విభిన్న తీర్పులతో గుర్తింపు..
రాజోలు నియోజకవర్గం అనగానే విభిన్న తీర్పులు ఇచ్చే నియోజకవర్గంగా పేరుంది. 2004 వరకు జనరల్‌ స్థానంగా ఉన్న రాజోలు నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఎస్సీ రిజర్వుడుగా మారింది. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరపున సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అల్లూరి కృష్ణంరాజు ఎమ్మెల్యేగా ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. రిజర్వుడు స్థానం అయ్యాక 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గొల్లపల్లి సూర్యారావు, వైసీపీ తరపున బంతు రాజేశ్వరరావు తలపడ్డారు. ఈ ఎన్నికల్లో 4683 ఓట్లు మెజార్టీతో గొల్లపల్లి సూర్యారావు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున మళ్లీ బంతు రాజేశ్వరరావుకే అవకాశం ఇవ్వగా తొలిసారి జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు 1,167 ఓట్లు పైచేయి సాధించి గెలుపొందారు. ఈసారి సీన్‌ రివర్స్‌లో కనిపిస్తుంది.. జనసేన తరపున బంతు రాజేశ్వరరావు పోటీలో దిగే అవకాశాలుండగా వైసీపీ అభ్యర్ధిగా రాపాక వరప్రసాదరావు బరిలో దిగే అవకాశాలున్నాయి.


Also Read: కొత్తపేట వైసీపీ కోటగా ఎలా మారింది? ఈసారి చేజారిపోతుందా?


Also Read:  టీడీపీ కంచుకోట రాజమండ్రి రూరల్‌లో వైసీపీ వ్యూహం ఫలిస్తుందా?