Gorantla Butchaiah Chowdary: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ (TDP)కి కంచుకోటగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి పేరుంది. 2008 తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏర్పడిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వరుసగా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడ్డాగా పిలుస్తుంటారు. ఈ నియోజకవర్గం ఏర్పాడ్డాక టీడీపీకే ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మంతా వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభావం ఉన్నా ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ జెండానే రెపరెపలాడింది. చందన రమేష్ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ నుంచి గెలుపొందారు. 2019లో రాష్ట్ర మంతా వైసీపీ గాలి వీచినా రామండ్రి రూరల్ నియోజవర్గం మాత్రం టీడీపీ నెగ్గింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా తన అనుభవంతో రాజమండ్రి రూరల్ స్థానాన్ని టీడీపీ కంచుకోటగా చేశారు.
ఈసారి కూడా టీడీపీకే పట్టం కడతారా..
2009లో ఏర్పడ్డ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వరుస విజయాలతో టీడీపీ కంచుకోటగా ఉన్న రాజమండ్రి రూరల్ 2024 ఎన్నికల్లో కూడా విజయం తథ్యమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2.70 లక్షలపైచిలుకు ఓటర్లు ఉన్న ఈనియోజకవర్గంలో గోరంట్లను ఢీకొట్టే నేత లేకనే వైసీపీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుందన్న చర్చ జరుగుతోంది. ఇటీవల వైసీపీ ప్రకటించిన నియోజకవర్గ ఇంచార్జ్‌ల జాబితాలో అనూహ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నియమించడం వెనుక టీడీపీ కంచుకోటను సామాజిక సమీకరణాల ద్వారా బద్దలు కొట్టాలన్న టార్గెట్‌తో నియమించినట్లు తెలుస్తోంది.
రాజమండ్రి నియోజకవర్గంలో ఎక్కువ ఓటర్లు కాపు, బీసీ శెట్టిబలిజ ఓటర్లే కీలకం కాగా ఈనియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వేణుగోపాలకృష్ణను నియమించడం ద్వారా టార్గెట్‌కు రీచ్ అవ్వవచ్చన్నది వైసీపీ అంచనాగా తెలుస్తోంది.. అయితే టీడీపీ మాత్రం ఈసారికూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరినే బరిలో దింపేందుకు మొగ్గుచూపనుంది. లేదా ఆయన కుమారుడిని రంగంలోకి దింపే అవకాశాలున్నాయన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న టీడీపీ నాలుగోసారి కూడా విజయకేతనాన్ని ఎగురవేసేందుకు ప్రయత్నిస్తోందట..
మూడుసార్లు ఏకపక్షంగా తీర్పు...
మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న టీడీపీకు 2009లో మినహా సంపూర్ణ మెజారీటీనే ఇచ్చారు ఇక్కడి ఓటర్లు.. 2009లో ముక్కోణపు పోటీలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం తలపడ్డాయి.. టీడీపీ తరపున వస్త్ర వ్యాపారి చందన రమేష్, కాంగ్రెస్ పార్టీ తరనున జక్కంపూడి విజయలక్ష్మి, పీఆర్పీ తరపున రవణం స్వామినాయుడు తలపడ్డారు. 32.39 శాతం ఓట్లు సాధించిన టీడీపీ పీఆర్పీ అభ్యర్ధిపై 1,547 ఓట్లు మెజార్టీతో చందన రమేష్ గెలుపొందారు.
2014లో టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ నుంచి ఆకుల వీర్రాజులు పోటీ పడ్డారు. టీడీపీ 52.22 శాతం ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్ధిపై 18,058 ఓట్లు మెజార్టీతో విజయం సాధించింది. 2019లో టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ నుంచి ఆకుల వీర్రాజు, జనసేన నుంచి కందుల దుర్గేష్‌లు బరిలో నిలబడ్డారు. 74,166 ఓట్లు సాధించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ అభ్యర్ధి ఆకుల వీర్రాజు పై 10,404 ఓట్లు మెజారిటీ సాధించి గెలుపొందారు.