Kasu Mahesh Reddy Comments on YSRCP Leaders : ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. వైసీపీ పరాజయానికి ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా కారణాలను విశ్లేషించుకుంటున్నారు. ఇలాంటి పరాభవానికి కారణం ఏమై ఉండొచ్చన్న దానిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ ఓటమి పైన ఇప్పటి వరకు వైసీపీ నేతలు అనేక రకాల విశ్లేషణలు చేశారు. వై నాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీ రాష్ట్రంలో కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఈ ఎన్నికల ఫలితాల పైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విజయానికి, వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఓ  వీడియోను షేర్ చేశారు. ఈ కారణాలే చంద్రబాబులో ఆయన పార్టీలో  కసిని పెంచాయని ఆయన విశ్లేషించారు. 2019 లో జగన్.. 2024లో చంద్రబాబును గెలిపించింది ఆయా పార్టీల కేడర్ కసినే అంటూ చెప్పుకొచ్చారు. 


అయినా ఎందుకు ఓడిపోయాం ?
ఎన్నికలు పూర్తయిన తర్వాత రెండు వారాల నుంచి కార్యకర్తలు పలువురు నాయకులు వచ్చి కలుస్తున్నారు. వచ్చిన వారంతా అడుగున్న ప్రశ్న ఒక్కటే. ఇంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అంటూ ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉన్నా.. ఎందుకు ఓడిపోయామని అడుగుతున్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా పార్టీలోని ప్రతి కార్యకర్తకూ చెప్పేది ఒకటే . రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సర్వసాధారణం. వాటిని పాజిటివ్ గా తీసుకోవాలి. ప్రతిపక్ష పాత్రను హుందాగా నిర్వర్తించాలి. అయితే ఓడిపోవటానికి ప్రధానంగా రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. సంక్షేమం బ్రహ్మాండంగా చేసినా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులే ఈ విషయాలు చెప్పారని కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు,  కాసు మహేష్ రెడ్డి చెప్పారు.


మందే మమ్మల్ని ఓడించింది
వైసీపీ ఓటమిపై మహేష్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. వైసీపీ ఓడిపోవడానికి  నాసిరకం మద్యమే ప్రధాన కారణం అని చెప్పారు. మందు తాగే వాళ్లు వైసీపీకి ఓటు వేయలేదన్నారు.   మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి అనేకసార్లు చెప్పాం. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదన్నారు. దాని పర్యవసానం నేడు కనిపిస్తోంది. రాష్ట్రంలో రోజూ 20 నుంచి 25 శాతం మంది మద్యం తాగుతుంటారు. నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ టీడీపీ చేసిన ప్రచారాన్ని వాళ్లంతా నమ్మారు.  ఇదేకాదు.. మరికొన్ని కారణాలు కూడా వైసీపీ అభ్యర్థులను ఓడించాయని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ఇసుక పాలసీ వల్ల పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఇసుక మీద ఆధారపడే వాళ్లు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారిని చెప్పుకొచ్చారు. కార్మికులంతా మెరుగైన ఇసుక పాలసీ తెస్తారని టీడీపీకి ఓటేశారు. ఈ రకంగా కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో మద్యం, ఇసుక పాలసీ దెబ్బకొట్టాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వైసీపీని దెబ్బకొట్టిందని మహేష్ రెడ్డి విశ్లేషించారు. 


నోటి దురుసే కొంపముంచింది
అలాగే జగన్ ఓడిపోవడానికి మరో కారణం కూడా ఉంది. వైసీపీ నేతల నోటి దురుసు కూడా పార్టీకి నష్టం కలిగించిందన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చంద్రబాబుని బూతులు తిట్టారని.. ఇలాంటి అవమానాలు చంద్రబాబు, టీడీపీ నాయకుల్లో కసిని పెంచాయన్నారు. అవమానాలు మనిషి పోరాట పటిమను పెంచుతుంది. ఎవరిని అవమానాలకు గురి చేసినా వారిలో కసి పెరిగి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోందన్నారు.  అలాగే చంద్రబాబును అకారణంగా జైళ్లో పెట్డడం కూడా టీడీపీ కార్యకర్తలు అవమానంగా భావించారు.  2019లో జగన్ గెలిచినా, 2024లో చంద్రబాబు గెలిచినా అవమానాల నుంచి వచ్చిన కసే కారణమని మహేష్ రెడ్డి అన్నారు.  టీడీపీ వాళ్లు గెలిచాక చాలా చోట్లు దాడుల చేయిస్తున్నారని ఆయన విమర్శించారు.  వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారన్నారు. కూల్చివేత చట్ట పరంగా జరిగినా.. ఇంత త్వరగా చేయాల్సిన అవసరం లేదన్నారు.