YCP MLAs want to attend the assembly Will you defy Jagan: అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ తీసుకున్న నిర్ణయం మిగిలిన పది మంది ఎమ్మెల్యేలకు నచ్చడం లేదన్న ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది. సమావేశం పెట్టిన రోజున నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా జగన్ నే అడిగారని.. జగన్ రాకపోతే మిగిలిన ఎమ్మెల్యేలు వెళతామని చెప్పారని కానీ జగన్ వద్దే వద్దని చెప్పారని అంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కారణం లేకుండా అసెంబ్లీకి వెళ్లకపోతే ఎలా అని.. ప్రజలకు ఏం సమాధానం చెబుతామని వారిలో కొంత మంది అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం తాను మీడియా ముందు మాట్లాడతానని మీరెవరూ అసెంబ్లీకి వద్దని తేల్చేశారు.
ఏ ఎమ్మెల్యేకైనా అసెంబ్లీలో మాట్లాడాలన్నది టార్గెట్
ప్రజాప్రతినిధిగా ఎన్నికవడం అంటే.. అసెంబ్లీలో అధ్యక్షా అని పిలవాలన్నది చాలా మంది కోరిక. అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేకుండా చేస్తే వారు అంత తేలికగా అంగీకరించే అవకాశాలు ఉండవు. గెలిచిన పదకొండు మందిలో నలుగురు మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన వారు ఉన్నారు. రెండో సారి ఎంపిక అయినా గత సభలో పెద్దగా మాట్లాడే అవకాశం రాని వారు ఉన్నారు. ఇక అసెంబ్లీ విలువ తెలిసిన సీనియర్ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి కారణం లేకుండా డుమ్మా కొట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నేరుగా చెప్పకపోయినా ఏదో ఓ కారణంతో జగన్ ను ఒప్పించి అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారు.
Also Read: వైసీపీ ఏదీ కలసి రావడం లేదు - జగన్‌ను సలహాదారులు ముంచేస్తున్నారా ?
ప్రశ్నలు అడిగేందుకు వెళ్లొచ్చని మొదట చెప్పిన వైసీపీ హైకమాండ్
అసెంబ్లీలో ప్రశ్నలు ఉన్నప్పుడు వైసీపీ సభ్యులు వెళ్లవచ్చని మొదట హైకమాండ్ చెప్పింది. దీంతో వారు తొలి రోజు అసెంబ్లీకి వెళ్లేందుకు ఉత్సాహంగానే వచ్చారు. కానీ తీరా తాడేపల్లిలో పార్టీ ఆఫీసుకు వచ్చిన తర్వాత చూస్తే జగన్ అసలు అసెంబ్లీకే వద్దని చెప్పారు. మరో వైపు శాసనమండలి సభ్యులు సభకు వెళ్తున్నారు. వారు మాట్లాడుతున్నారు. వారికి మాట్లాడే చాన్స్ వస్తోంది. మరి వైసీపీ సభ్యులకు ఎందుకు రాదని వారు అనుకుటున్నారు. అసెంబ్లీకి వెళ్లే విషయంలో జగన్ ను మరోసారి ఒప్పించేందుకు ప్రయత్నించాలని అనుకుంటున్నారు. లేకపోతే సొంత నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
పెద్దిరెడ్డి నేతృత్వంలో అసెంబ్లీకి వెళ్తారా ?
పెద్దిరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఇటీవల జగన్ తో సమావేశాలకు పెద్దిరెడ్డి వస్తున్నా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆయన కుమారుడు.. పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మిథున్ రెడ్డి అసలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంపై అంత సంతృప్తిగా లేరని అంటున్నారు. ఒక వేళ ఆయన కాకపోతే.. మిగిలిన కొంత మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యే ఆలోచనలో ఉన్నారు.
Also Read: బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
అనర్హతా వేటు భయం కూడా!
వరుసగా మూడు సెషన్ల పాటు కారణం లేకుండా అసెంబ్లీకి హాజరు కాకపోతే వారిపై అనర్హతా వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంది. కనీసం 90 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆయనపై విచారణ లేకుండా అనర్హతా వేటు వేయవచ్చు. అసెంబ్లీకి వెళ్లకపోతే పదవి పోతుందని.. అప్పుడు మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారు. అందుకే ఈ సమావేసాలకు కాకపోియనా వచ్చే సమావేశాలకు అయినా కొంత మంది హాజరయ్యే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జగన్ సొంత ఎమ్మెల్యేల ఒత్తిడికి ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.