Ketireddy and Vidadala Rajni are also trying to meet Pawan : ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటపడేందుకు లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను ఇప్పటికే పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఉదయభాను ఎన్నికలకు ముందే పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది కానీ ఎక్కడా సీటు లభించే అవకాశం లేకపోవడంతో వైసీపీలోనే కొనసాగారు. జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. 


కేతిరెడ్డిని జనసేనలో చేర్చుకోవడంపై టీడీపీ నేతల వ్యతిరేకత


వైసీపీ నేతల  నుంచి జనసేన  పార్టీకి చాలా ఎంక్వయిరీలు వస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు మాజీ మంత్రి విడదల రజనీ కూడా పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. జనసేనలో చేరే అంశంపై వీరు ఇప్పటికే కీలక నేతలతో చర్చలు జరిపారని అంటున్నారు. కేతిరెడ్డి చేరికపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ధర్మవరంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ బీజేపీకి సీటు కేటాయించినా.. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దగ్గరుండి ఆయన కోసం పని చేసి గెలిపించారు. ఇప్పుడు కూటమిలోకి కేతిరెడ్డి వస్తే.. స్వాగతించే  పరిస్థితి ఉండదని చెబుతున్నారు. కేతిరెడ్డి, పరిటాల వర్గాల మధ్య చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. 


విడదల రజనీకి అడ్డంకిగా పదవిలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు 


ఇక విడదల రజనీ కూడా..జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగినప్పటికీ.. జనసేన అయితే మంచిదన్న ఉద్దేశంతో ప్రాథమిక చర్చలు జరిపారని అంటున్నారు. కానీ చిలుకలూరిపేటలో విడదల రజనీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. పలువురు వ్యక్తులు తమ దగ్గర కోట్లు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. కొన్ని కేసులు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఆమెను జనసేనలో చేర్చుకోవడం మంచిది కాదని కూటమి పార్టీల నుంచి జనసేన పార్టీకి సంకేతాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై జరుగుతున్న చర్చల్లో స్పష్టత వస్తే.. విడదల రజనీ కూడా జనసేనలోకి చేరే చాన్సులు ఉన్నాయని అంటున్నారు. 


జనసేనలో చేరేందుకు పలువురు వైసీపీ నేతల ఆసక్తి         


ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకూ వైసీపీ పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని.. సమీప భవిష్యత్ లో కోలుకుంటుందన్న నమ్మకం  లేకపోవడంతో ఎక్కువ మంది జనసేన వైపు చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎంత మంది నేతలు వచ్చినా.. కూటమి పార్టీలతో చర్చించిన తర్వాతే చేరికలపై స్పష్టత ఇవ్వాలని జనసేన భావిస్తోంది.  బీజేపీతోనూ కొంత మంది నేతలు టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి మరింత ఎక్కువగా నేతల వలస ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.