When will the Telangana government conduct the local elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తున్నాయన్న ప్రచారం ఏడాదిగా జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించేసి పాలనపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ అనుకున్నారని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ ఇప్పుడు మున్సిపాలిటీల గడువు ముగిసినా ఇంకా ఎన్నికలు పెట్టలేదు. ఇప్పటి వరకూ కనీసం ప్రక్రియ కూడా ప్రారంభించలేదు
తేల్చుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
గత డిసెంబర్‌లో సంక్రాంతి పండుగ అవగానే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్లు ప్రారంభమవుతాయని మీడియాకు లీకులు ఇచ్చారు. జనవరి నెల ముగుస్తున్నా ఇప్పటికీ క్లారిటీ లేకుండాపోయింది. పంచాయతీల పదవి కాలం ముగిసి చాలా రోజులు అయింది. స్పెషలాఫీసర్ల పాలనలోకి పోయాయి . పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే క్యాడర్ కు కొన్ని పదవులు వచ్చి ఉండేవన్న అభిప్రాయం ఉంది. మాములుగా అయితే వాటి గడువు ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆలోచనలు చేస్తూనే ఉంది.
పథకాలు, బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు సవాళ్లు !
పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లెక్క తేలాల్సి ఉంది. ఎదుకంటే రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళతామని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఆ కమిటీ నివేదికను అనుసరించి పంచాయతీలు మున్సిపాలిటీ ల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవాలి. అయితే న్యాయపరమైన సమస్యలు వస్తే ఎన్నికలు ఆగిపోతాయి. అయితే ప్రభుత్వం తల్చుకుంటే.. వెంటనే ఎన్నికలు పెట్టవచ్చు. కానీ రాజకీయంగా అనుకూలమైన వాతావరణం కోసం ఎదురుచూస్తోందన్న అభిప్రాయం ఉంది.
పెద్దఎత్తున పథకాలను అమలు చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోంది. రైతు భరోసాతో పాటు భూమిలేని రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇళ్లు ఇలా పెద్ద ఎత్తున లబ్దిదారుల్ని ఖరారు చేసి.. వారికి తొలి విడత సాయంచేసి ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రకారం పథకాల అమలు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వానికి నిధుల కొరత వెంటాడుతోంది. అందుకే పథకాల అమలు ప్రారంభించారు కానీ అందరికీ సాయం ఖాతాల్లో పడేసరికి కొంత సమయం పడుతుంది. ప్రభుత్వానికి నిధుల లభ్యతను బట్టి పథకాలు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లనున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అది అయిపోయే వరకూ వేచి చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు.
Also Read: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు