YSRCP high command not helping the YCP leaders and cadre: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పుడు మాట్లాడేందుకు ఎవరు బయటకు వస్తున్నారు అని చూస్తే.. కళ్ల ముందు ఒక్క అంబటి రాంబాబు మాత్రమే కనిపిస్తున్నారు. అప్పుడప్పుడూ రోజా వస్తున్నారు. మహిళల్ని అరెస్టు చేయవద్దని చంద్రబాబు స్పష్టం చేశారన్న విషయం బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. అయితే మిగతా అగ్రనేతలు ఎవరూ ప్రభుత్వంపై పోరాటానికి ముందుకు రావడం లేదు. చివరికి విజయసాయిరెడ్డి వంటి నేతలు రాజకీయ సన్యాసం ప్రకటించేస్తున్నారు. దీనంతటికి కారణం హైకమాండ్ అండగా ఉంటామన్న భరోసా ఇవ్వకపోవడమేనని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.
పేర్ని నాని నుంచి పెద్దిరెడ్డి వరకూ అందరికీ ఎన్నో సమస్యలు !
పేర్ని నాని గతంలో తరచుగా మీడియా ముందుకు వచ్చేవారు. ఇప్పుడు ఆయన కూడా కనిపించడం లేదు. ఆయనపై బియ్యం మాయం కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో కిందా మీదా పడి ఆయన కుటుంబం అరెస్టు కాకుండా రక్షించుకునేందుకు ఎవరికీ కనిపించకుండా తిరిగారు. ఎలాగోలా అరెస్టు నుంచి రక్షణ పొందినా ఆయన మీడియా ముందుకు రావడం లేదు. నియోజకవర్గంలో పెద్దగా తిరగడం లేదు. ఒక్క పెద్దిరెడ్డి కాదు శ్రీకాకుళంలో ధర్మాన దగ్గర నుంచి కడపలో శ్రీకాంత్ రెడ్డి వరకూ అందరూ వీలైనంత వరకూ మౌనం పాటిస్తున్నారు. దీంతో వైసీపీ పూర్తి స్తబ్దతగా మారిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనంతటికి కారణం అధికారం పోవడం వల్ల వచ్చి పడిన ఒత్తిళ్లే. అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని కార్యకలాపాల వల్ల ఇప్పుడు వారు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
కేసుల్లో పార్టీ నుంచి వారికి లభిస్తున్న సహకారం శూన్యం !
పార్టీ ముఖ్యనేతలు కేసుల పాలైనా పార్టీ నుంచి సహకారం అందకపోవడం చాలా మంది సీనియర్ నేతల్ని కూడా అసంతృప్తికి గురి చేస్తోందని చెబుతున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ .. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఐదు నెలల పాటు జైల్లో ఉన్నారు. మొదట్లో ఆయనకు మద్దతుగా వైసీపీ నుంచి కాస్త సహకారం లభించినప్పటికీ తర్వాత వారు కూడా పట్టించుకోలేదు. చివరికి నందిగం సురేష్ భార్య పోరాడి .. ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్నారని చెబుతున్నారు. బెయిల్ పై నందిగం సురేష్ బయటకు వచ్చే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక్క వైసీపీ నేత కూడా ఆయనకు స్వాగతం చెప్పేందుకు రాలేదు. దీంతో ఆయన హతాశుడయ్యారు. రాజకీయ పరమైన కేసు అని ప్రజల్లోకి వెళ్లాలంటే పార్టీ సపోర్టు ఉండాలని లీడర్లు కోరుకుంటారు.కానీ పార్టీ సపోర్టు లేకపోవడంతో వారు వీలైనంత వరకూ సైలెంట్ గా ఉండాలని అనుకుంటున్నారు.
క్యాడర్ నూ పట్టించుకోకపోవడంతో సమస్యలు
లీడర్లతో పాటు క్యాడర్ కూడా సమస్యల్లో ఉంది. పార్టీ అధికారం పోయిన వెంటనే చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలు అకౌంట్లను డీయాక్టివేట్ చేసుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే కొంత మంది మాత్రం పార్టీ అండగా ఉంటుందని నిలబడి పోరాడాలనుకున్నారు. వారిపై కేసులు నమోదు కావడంతో చాలా రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ప్రత్యేకంగా లాయర్ల బృందాన్ని పెట్టినట్లుగా ప్రకటించినప్పటికీ ఆ సహకారం ఎవరికీ అందలేదు. దీంతో వైసీపీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. హైకమాండ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉండకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని ఆ పార్టీ వారు అనుకుంటున్నారు.