KCR BRS Strategy :   భారత రాష్ట్ర సమితి పార్టీకి ఢిల్లీలో పర్మినెంట్ అడ్రస్ రెడీ అయింది. అత్యాధునిక హంగులతో ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను రెడీ చేశారు. పార్టీ కార్యక్రమాలు గురువారం నుంచి అక్కడే జరగబోతున్నాయి. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించడానికే అక్కడే బీజం పడుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కేసీఆర్ లక్ష్యం కూడా అదే. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఇలా మార్చి చాలా కాలం అవుతోంది కానీ కేసీఆర్ అడుగులు మాత్రం జాతీయ రాజకీయాల వైపు చురుగ్గా పడటం లేదు. ఇటీవలి కాలంలో ఆయన మరీ సైలెంట్ అయిపోయారు. మరో వైపు ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్టీని జాతీయ పార్టీగా మార్చిన  తర్వాత కేసీఆర్ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటున్నారన్నది రాజకీయవర్గాలకీ ఆశ్చర్యమే. 


జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ మౌనం 


భారత రాష్ట్ర సమితి ప్రకటన తర్వాత కేసీఆర్ దేశమంతా పర్యటించాలని అనుకున్నట్లుగా ఆ పార్టీ నేతలు చెప్పారు. నిజానికి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చక ముందే కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. దేశ్ కీ నేత ఇమేజ్ కోసం ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా పార్టీ ఏర్పాటు తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టాలని అనుకున్నారు. కానీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా సభ పెట్టడం లేదు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు కోసం సభలు పెట్టాలనుకున్నారు. కానీ అసలు ఆయా రాష్ట్రాల నుంచి ఒక్క నేతను కూడా పార్టీలో చేర్చుకోలేదు. ఇటీవలి కాలంలో అసలు ఒక్క మహారాష్ట్ర తప్ప మరో రాష్ట్రంలో పార్టీ విస్తరణ గురించి కేసీఆర్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. 


ఒడిషా, ఏపీ ఇంచార్జుల్ని నియమించినా కార్యకలాపాల్లేవు !


కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన తర్వాత చురుకుగా అన్ని రాష్ట్రాలకు ఇంచార్జుల్ని నియమించి ఆ తర్వాత జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించాలనుకున్నారు. ఒడిషా నుంచి మాజీ సీఎం గిరిధర్ గమాంగోను చేర్చుకున్నారు. ఏపీ నుంచి తోట చంద్రశేఖర్‌ను కూడా చేర్చుకున్నారు. వారిని ఆయా రాష్ట్రాలకు ఇంచార్జులుగా ప్రకటించారు. చత్తీస్ ఘడ్ నుంచి  అజిత్ జోగి కుమారుడిని కూడా పిలిచి మాట్లాడారు. అంతే ఆ తర్వాత  ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ రావడం లేదు . కేసీఆర్ కలవడం లేదు. ఇంచార్జుల్ని ప్రకటించిన ఏపీ, ఒడిషాల్లోనూ సభలు పెట్టలేదు. ఇదిగో సభ. .అదిగో సభ అని అప్పుడప్పుడూ ప్రకటనలు చేస్తున్నారు. చివరికి పొరుగున ఉన్న కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూంటే అసలు  పట్టించుకోలేదు. జేడీఎస్ తో కలిసి పని చేస్తామని ఘనమైన ప్రకటనలు చేశారు కానీ..  చేతల్లోకి వచ్చే సరికి సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహాలపై చాలా మందిలో అనుమానాలు ప్రారంభమయ్యాయి. 


మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టినా మొదటే ఎదురు దెబ్బ !


కారణం ఏమిటో కానీ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కన్నా మహారాష్ట్రపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ శివారులో ఉన్న జిల్లాల్లో మూడు సభలు పెట్టారు. పలువురు నేతల్ని చేర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నారు. అక్కడ స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బోకర్ నియోజకవర్గ మార్కెట్ యార్డు ఎన్నికల్లో నూ పోటీ చేశారు. ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరడంతో ఆయన బీఆర్ఎస్ మద్దతుదారులను మార్కెట్ యార్డ్ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. కానీ ఒక్క డైరక్టర్ పోస్టులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవలేదు. దీంతో తొలిసారే ఎదురు దెబ్బ తగిలినట్లయింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఇలాంటి పలితాలు వస్తే కేసీఆర్ ఎంతో దృష్టి పెట్టి.. ఆశలు పెట్టుకున్న మహారాష్ట్రలో సైతం బీఆర్ఎస్‌ ఉనికి కష్టమవుతుంది. 


ముందు తెలంగాణపై కేసీఆర్ దృష్టి పెట్టారా ?


కేసీఆర్ జాతీయరాజకీయాలపై దృష్టి పెట్టి తెలంగాణను నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని అందుకే ఆయన తెలంగాణపై దృష్టి పెట్టారని అంటున్నారు. మూడోసారి తెలంగాణలో గెలిస్తే దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరు మోగుతుందని అప్పుడు పార్టీ విస్తరణ సులువు అవుతుందని అంటున్నారు. అందుకే కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని చెబుతున్నారు.