YSRCP parliamentary party Plan In parliament: అసెంబ్లీ లేదా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉంటే ఆ పార్టీలకు చెందిన ఎంపీలందరికీ అధ్యక్షుడు దిశానిర్దేశం చేయడం సాధారణ ప్రక్రియ. రాష్ట్రం కోసం అనుసరించాల్సిన వ్యూహాలను అధినేత ఎంపీలకు సూచించి పంపిస్తారు. గతంలో ముగ్గురు ఎంపీలే ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించేవారు. రెండు రోజుల కిందట కూడా ఎంపీలతో సమావేశం అయ్యారు. వారు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అయితే వైసీపీ ఎంపీలకు మాత్రం కనీసం సూచనలు సలహాలు ఇచ్చేవారు లేకుండా పోయారు.
విదేశాల్లో జగన్ - విజయసాయిరెడ్డి సన్యాసం
వైసీపీ అధ్యక్షుడు జగన్ తన కుమార్తె గ్రాడ్యూయేషన్ డే కోసం కోర్టు అనుమతితో లండన్ పర్యటనకు వెళ్లారు. నెలాఖరు వరకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. 31వ తేదీన ఆయన ఇండియాకు రానున్నారు. ఆ రోజున పాస్ పోర్టు కోర్టులో సరెండర్ చేయాల్సింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రావొచ్చు. అయితే పార్లమెంట్ సమావేశాలు అదే రోజున ప్రారంభమవుతున్నాయి. పార్లమెంట్ లో ఎం చేయాలన్నది వీడియో కాన్ఫరెన్స్ అయినా ఎంపీలకు దిశానిర్దేశం చేయలేదు. ఇక ఢిల్లీలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుని ఆయన వ్యవసాయంలోకి దిగిపోయినట్లుగాఫోటోలు పెట్టారు. ఇప్పుడు వైసీపీ ఎంపీలకు ఎవరూ దిశానిర్దేశం చేసేవారు లేరు.
రాజ్యసభలో ఇప్పటికీ వైసీపీ బలం కీలకమే !
లోక్ సభలో వైసీపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో పదకొండు మంది ఉండాల్సింది నలుగురు రాజీనామా చేశారు. ఇప్పటికీ ఏడుగురు సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ లో మోదీ ప్రభుత్వం కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతోంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు జేపీ నుంచి స్పీకర్ కు చేరింది. ఆ బిల్లుపై ఓటింగ్ జరగాల్సి ఉంది. అలాగే మరికొన్ని కీలక బిల్లులు రానున్నాయి. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తే.. రాజ్యసభలో వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు అవసరమైన వ్యూహాలను అమలు చేయవచ్చు. కానీ పార్లమెంట్ కు హాజరవడం తప్ప లోపల ఏమి మాట్లాడాలో కూడా సరైన దిశానిర్దేశం లేక.. ఎంపీలు కిందా మీదా పడే అవకాశం ఉంది.
కీలక బిల్లులకు ఎన్డీఏకు మద్దతివ్వక తప్పని పరిస్థితి !
ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన పార్టీ ఉన్నప్పటికీ.. ఆ కూటమికి వైసీపీ మద్దతు ప్రకటించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. అంతర్గతంగా అయినా జాతీయ పార్టీల జోలికి వెళ్లవద్దని ఎవరిపైనా విమర్శలు చేయవద్దన్న సంకేతాలు ఎంపీలకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు కానీ..ఇతర జాతీయ అంశాలపై స్పందించే అవకాశాలు ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే ఓటింగ్ జరిగితే ఎన్డీఏకు మద్దతుగానే ఓట్లు వేయడానికి ఎక్కువ అవకాశం ఉంది.
Also Read: కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?