YS Jagan Delhi Protest News | వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హత్య విషయం తెలిసిన వెంటనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడిచిన 40 రోజులుగా ఏపీలో దాడులు, కూల్చివేతలు, అత్యాచారాలతో ఆటవిక పాలన నడుస్తోందంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తన బెంగళూరు పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని వినుకొండకు బయల్దేరి వెళ్లనున్నట్టు ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే తమ అధ్యక్షుడితోపాటు నాయకులు పాల్గొనకుండా ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిందని, సెక్యూరిటీ తీసేసిందని, వైసీపీ నేతలు ఆరోపించారు. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రషీద్ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించిన జగన్ అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏనాడూ జగన్ ఇంత కాన్ఫిడెంట్‌గా కనిపించింది లేదు. పరామర్శ కోసం వచ్చి హత్యా రాజకీయాల గురించి మాట్లాడి వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. కానీ, పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో ఆధారంగా అమ్మకు వందనం పథకాన్ని ఉద్దేశించి ఇదే మంచి సందర్భం అనుకుని ప్రభుత్వాన్నికూడా గట్టిగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్
మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలనపై వెంటనే ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించే వరకు పార్లమెంట్ దగ్గర పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి వచ్చి జులై 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని కార్యాచరణ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం హనీమూన్ మూడ్‌లో ఉందని హామీల అమలుకు కొంచెం టైం ఇద్దామని తనను కలిసిన నాయకులతో చెప్పారు. ఆ మేరకు డిసెంబర్ నుంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. కానీ వరుసగా పార్టీ నాయకులపై, వారి ఆస్తులపై జరుగుతున్న దాడులతో, బయటకొచ్చేందుకు సమయం కోసం వేచి చూశారు. ఈ క్రమంలో వినుకోండలో జరిగిన రషీద్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో ఇదే అదనుగా జగన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
జగన్ ఢిల్లీ ధర్నా ప్రకటన వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. పైగా పార్లమెంట్ సమావేశాలు కూడా ఉండటంతో ఎన్డీఏ పాలనపై దేశవ్యాప్తంగా ప్రచారం తీసుకురావాలని వ్యూహ రచన చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం, కేంద్రంలో టీడీపీ సపోర్టుతో ఏన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో జరిగే దాడులకు బీజేపీ కూడా సమాధానం చెప్పుకుని తీరాల్సిన పరిస్థితి. బీజేపీని ముద్దాయిగా నిలబెట్టడమే జగన్ వ్యూహం కావొచ్చు. ఓడిపోయిన తర్వాత పలుమార్లు జగన్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటే.. టీడీపీకి 16 మంది ఎంపీలుంటే వైసీపీకి రాజ్యసభ లోక్ సభ కలిపితే 15 మంది ఎంపీలున్నారని చెప్పేవారు.
వైసీపీ ఎంపీల మద్దతు అవసరమన్న జగన్
ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా ఉన్నా, రాజ్యసభలో ఏవైనా బిల్లులు పాస్ కావాలంటే మాకున్న 11 మంది ఎంపీల బలం కీలకమని జగన్ ఉద్దేశం. అయినప్పటికీ ఆయన మాటలను అంతగా పట్టించుకోలేదు. తన పార్టీ నాయకుల మీద దాడులు, ఆస్తుల ధ్వంసం వంటివి ఆగలేదు. దాడులపై రెండుసార్లు పార్టీ ప్రతినిధులు గవర్నర్‌ని కలిసినా కనీసం స్పందన రాలేదు. స్పీకర్‌కి లేఖ రాసి రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదా కోసం అభ్యర్థించినా కనీసం ఇప్పించలేదు. దాడుల సంస్కృతి మంచిది కాదని ఏ బీజేపీ నాయకుడు కూడా కనీస ప్రకటన చేయలేదు. గడిచిన ఐదేళ్లు బీజేపీకి అన్ని విధాలుగా కేంద్రంలో మద్దతు ప్రకటించినా ఈ విధంగా వ్యవహరించడం జగన్‌కు రుచించకపోవచ్చు. ఇలాగే చూస్తు కుర్చుంటే సీటు కిందకే నీరు వస్తుందని జగన్ భావించి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడానికి ఇదే మంచి సమయంగా భావించి బరిలోకి దూకుతున్నారు.
అయితే జగన్ ఎంత దూకుడు ప్రదర్శిస్తారనేది ఇక్కడ ఆసక్తి రేపుతున్న అంశం. కేవలం ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను, రాష్ట్రపతి ముర్ముని కలిసి వినతిపత్రం ఇచ్చేసి వస్తారా.. లేక ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలుస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం ఏర్పాటై కేవలం 40 రోజులే గడిచింది కాబట్టి జగన్ అంత దూకుడుగా వెళ్లకపోవచ్చు అనేది ఒక వాదనైతే.., రాహుల్ గాంధీని కలవడం ద్వారా రాబోయే రోజుల్లో చంద్రబాబు, కాంగ్రెస్ కి దగ్గరకాకుండా కర్చీఫ్ వేసి సీటు రిజర్వు చేసి పెట్టుకుంటాడని ఇంకో వాదన వినిపిస్తోంది. రెండోది గనుక జరిగితే రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లోనూ తీవ్ర పరిణామాలు చోటుచేసుకోవచ్చు.
Also Read: టీడీపీ అరాచకాలపై పార్లమెంట్‌లో గళమెత్తాలి - ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందా?
ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, జార్ఖండ్, హర్యానా ఎన్నికల తర్వాత ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందని ఇండియా కూటమి నేతలు చాలెంజ్‌లు విసురుతున్నారు. గుజరాత్‌లో బీజేపీని ఈసారి ఓడించి తీరుతామని రాహుల్ గాంధీ కూడా మోడీకి పార్లమెంట్‌లోనే రాసిపెట్టుకోమని సవాల్ విసిరారు. దానికి తగినట్టే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు బీజేపీ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఏడాది చివరి నాటికి ఎన్నికలు పూర్తయితే మరింతమంది బీజేపీ ఎంపీలను చేర్చుకుని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టొచ్చు. అదే జరిగితే ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్ వినిపిస్తున్న నితీశ్ కుమార్ సైతం బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయవచ్చు. ఈ క్రమంలో బీజేపీ ఓడిపోయే పరిస్థితులే కనుక ఉంటే అదే ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో.. చంద్రబాబుని కాంగ్రెస్‌కి దగ్గర కాకుండా చేస్తే రాష్ట్రంలో ఏకాకిని చేసేయవచ్చని వ్యూహం ఉండవచ్చు. 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో జగన్ సాహసం చేస్తారా లేదా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.