ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుసగా రెండు రోజుల పాటు ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయన ప్రతిపక్షాలను చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. వారు చనిపోతారన్నట్లుగా మాట్లాడుతున్నారు. తన వెంట్రుక  కూడా పీకలేరని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు  రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు కార్యక్రమం ఏమిటి ..? ఆయన చేస్తున్న విమర్శలేమిటి ? ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఇలా ఘాటుగా మాట్లాడుతున్నారా? అక్కడేమైనా జరిగిందా ? 


చంద్రబాబు పవన్‌లపై విరుచుకుపడుతున్న జగన్ !
 
ముఖ్యమంత్రిగా జగన్ వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన తన పాలనపై వంద శాతం నమ్మకంతో ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తున్నామని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన అనుకుంటూ ఉంటారు. అందుకే ఆయన ప్రతిపక్షాలను పెద్దగా పట్టించుకున్నట్లుగా ఉండరు. అయితే వరుసగా రెండు రోజుల పాటు నిర్వహించిన బహిరంగసభల్లో మాత్రం ఆయన ప్రసంగం పూర్తిగా మారిపోయింది. నర్సరావుపేట  ప్రసంగంలో ప్రతిపక్ష నేతలకు గుండె పోటు వస్తుందని..త్వరగా టిక్కెట్ తీసుకుంటారని అనేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దెయ్యాలన్నారు. నంద్యాలలో  వసతి దీవెన పథకం నిధులు విడుదల చేసేందుకు మీట నొక్కేందుకు నంద్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఇంకా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ తన వెంట్రుక కూడా పీకలేరని అనేశారు. ముఖ్యమంత్రి స్థాయి నేత చేయాల్సిన వ్యాఖ్యలు .. విమర్శలు కావు ఇవి. దీంతో సహజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఢిల్లీ పర్యటన తర్వాతే మార్పు వచ్చిందా ? 
 
ముఖ్యమంత్రి జగన్ వరుసగా ఇలాంటి వ్యాఖ్యలను ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే చేస్తున్నారని రాజకీయవర్గాలు గుర్తు  చేస్తున్నాయి.  జగన్మోహన రెడ్డి ఊహించనిది ఏదో జరుగుతోందని అందుకే ఆయన ఫ్రస్ట్రేట్‌కు గురవుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ పరంగా ఏమైనా ఎదురు దెబ్బలు తగిలి ఉంటాయా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అప్పుల పుట్టించుకోవడం కూడా కష్టంగా మారింది. బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధపడలేదా అన్న అనుమానం కూడా వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఉంది. 







టీడీపీతో జనసేన కలవకండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదా ?


జనసేన పార్టీ ఇటీవలి కాలంలో ఓట్లు చీలనివ్వబోమని చెబుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ అదే చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ మళ్లీ రాదని చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో  పాటు అమిత్ షాను కూడా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ చర్చలు కూడా జరిగాయని..  జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగించాలని.. టీడీపీతో కలవకుండా చూడాలన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు. అయితే అక్కడ నుంచి సానుకూల సంకేతాలు రాలేదని.. అందుకే జగన్  మండిపడుతున్నారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు, జగన్ కలుస్తున్నారన్న కోపం జగన్లో ఎక్కువగా కనిపిస్తోందన్న అభిప్రాయం ఆయన విమర్శల్లో ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు, పవన్ కలుస్తున్నారని.. కలిసి వచ్చినా తనను ఏమీ చేయలేరని జగన్ అంటున్నారు. నిజానికి ఇప్పటి వరకూ వారిద్దరూ కలుస్తారని ఎక్కడా చెప్పలేదు. అయినా కలుస్తారేమో అని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని అంటున్నారు.  


సమయం , సందర్భం చూసుకోకుండా విమర్శలు !


రాజకీయ విమర్శలు చేయడానికి వేరే సందర్భాలు ఉన్నాయి. కానీ సీఎం జగన్ అలాంటి సందర్భాలు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల కార్యక్రమమా..వాలంటీర్ల కార్యక్రమమా అనేది చూసుకోకుండా  విప్కష పార్టీల్ని ఎలా విమర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే.. తమ ఎదురుగా ఉన్న  విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందన్న ఆలోచన కూడా సీఎంకు రాకపోవడం కరెక్ట్ కాదన్న వాదన ఎక్కువ మందిలో వినిపిస్తోంది. కారణం ఏదైనా సీఎం  జగన్ కోపానికి గురవుతున్నారన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.