Chandrababu On BJP :    ఏపీలో రాజకీయ పొత్తులపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ,జనసేనతో కలుస్తామని ఢిల్లీ బీజేపీ నేతలు సంకేతాలు పంపుతున్నారు.  కానీ ఇప్పుడే మాట్లాడబోమని.. చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. ఆయన నోటి వెంట ఒకటే మాట వినిపిస్తోంది..అదేమిటంటే రాష్ట్ర ప్రయోజనాలు. వాటిపై హామీ లభిస్తే పొత్తుకు ఆయన సిద్ధంగా ఉంటారని అంటున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రయోజనాలేమిటి ? వీటి గురించి .. బీజేపీ పెద్దల వద్ద ప్రతిపాదనలు పెట్టారా ?  వారి నుంచి స్పందన రావడం లేదా ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. 


ఎన్డీఏలో టీడీపీని చేర్చుకునేందుకు బీజేపీ సుముఖం


తెలుగుదేసం పార్టీని నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ లో చేర్చుకోవాలనేది బీజేపీ అభిప్రాయం. ఈ విషయంలో తాము కూడా రెడీగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు.కానీ బేషరతు అని చెప్పడం లేదు. కొన్ని షరతులు చెబుతున్నారు.  బయటకు ఆ షరతుల్ని రాష్ర ప్రయోజనాలు అని  చెబుతున్నారు. కానీ అవేంటో మాత్రం ఎవరికీ తెలియదు. బహుశా చంద్రబాబు ..బీజేపీ పెద్దల ముందే పెట్టి ఉంటారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ పర్యటనకు వచ్చిన పెద్దలు వైసీపీని విమర్శించారు. అమరావతిని సమర్థించారు. ప్రభత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సహజంగానే ఇవి సంచలనం  సృష్టించాయి. వైసీపీ నేతలు ఈ ఆరోపణల్ని లైట్ తీసుకున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ అని విమర్శలు చేసి ఊరుకున్నారు. 


చర్యలేవని ప్రశ్నించిన అచ్చెన్న,చంద్రబాబు !


ఈ సభల్లో విమర్శల తర్వాత టీడీపీ నుంచి బీజేపీకి కొన్ని డిమాండ్లు బహిరంగంగానే వెళ్లాయి. వైసీపీకి బీజేపీ దగ్గర కాదని నిరూపించుకోవాలన్నది అందులో ఒకటి. అలా నిరూపించుకోవాలంటే.. అమిత్ షా, జేపీ నడ్డా చేసిన విమర్శలకు అనుగుణంగా..ఏపీలో పరిస్థితులపై చర్యలు తీసుకోవాలనేది వారి డిమాండ్. చంద్రబాబు, అచ్చెన్నాయుడు నేరుగానే చర్యలెప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు. కానీ బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. డిల్లీ లిక్కర్ స్కాం తరహాలో.. ఏపీలో లిక్కర్ పాలసీపై విచారణ చేయించడం.. వివేకా హత్య కేసులో సీబీఐ పై ఒత్తిళ్లు లేకుండా చేయడం వంటివి టీడీపీ డిమాండ్ల లో ఉండవచ్చని అంటున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై సమగ్రంగా పరిశీలన జరిపి .. అక్రమంగా చేసిన అప్పుల లెక్కలు తేల్చాలన్నది కూడా ఓ షరతు అయి ఉండవచ్చని అంటున్నారు. 


యూసీసీ బిల్లు ఆమోదం తర్వాత టీడీపీ డిమాండ్లను బీజేపీ పరిశీలిస్తుందా ?


ప్రస్తుతం వైసీపీ విషయంలో బీజేప సాఫ్ట్ గా ఉంది. టీడీపీ పెట్టిన డిమాండ్లను పట్టించుకోవడం లేదు. అదే సమయంలో వీలైనంతగా సహకరిస్తోంది కూడా.  కానీ ఇదంతా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీ బిల్లుపై ఉన్న ఓటింగ్ కోసమని.. రాజ్యసభలో వైసీపీకి 9 మంది సభ్యులు ఉన్నారని వారి మద్దతు కీలకమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఆ బిల్లు ప్రక్రియ ముగిసిన తర్వాత టీడీపీతో కలవాలనుకుంటే.. డిమాండ్లను పరిశీలిస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే.. రాజకీయంగా మార్పులు వస్తాయి.ఎలాంటి చర్యలు తీసుకోకపోతే..అంటే టీడీపీ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకపోతే.. ఆ పార్టీతో పొత్తు వద్దనుకున్నట్లే అనుకోవచ్చు.