Donations To Political Parties: దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలకు సంబంధించిన వివరాల జాబితాను ఏడీఆర్ విడుదల చేసింది. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో ఎక్కువ శాతం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనే వస్తున్నట్లు వెల్లడించింది. 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో ఏడు జాతీయ పార్టీలు, ఇరవై నాలుగు ప్రాంతీయ పార్టీలకు 16,437 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్లు తన నివేదికలో పేర్కొంది. అందులో రూ. 9,188 కోట్లు కేవలం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనే వచ్చినట్లు తెలిపింది. ఇతర జాతీయ పార్టీల కంటే బీజేపీకే ఎక్కువ విరాళాలు లభించినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్)  నివేదించింది. 


బీజేపీకి రూ. 10 వేల కోట్ల విరాళాలు...


బీజేపీకి రూ. 10,122 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 1,547 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ. 823 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్‌ తన నివేదికలో వెల్లడించింది. బీజేపీకి వచ్చిన విరాళాల్లో సగానికిపైగా ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ఉండగా.. 32శాతం కార్పొరేట్‌ సంస్థల నుంచి వచ్చాయి. మొత్తం విరాళాల్లో 80 శాతం జాతీయ పార్టీలకు రాగా, ప్రాంతీయ పార్టీలకు 19.75 శాతం విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ వెల్లడించింది. ప్రాంతీయ  పార్టీలలో బీజేడీకి అత్యధికంగా రూ.622 కోట్లు రాగా అందులో 89.8శాతం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనే వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. డీఎంకేకు రూ. 431 కోట్లు, బీఆర్ఎస్​కు రూ.383 కోట్లు, వైసీపీకి రూ. 330 కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.


152 శాతం పెరిగిన కార్పొరెట్ విరాళాలు..


ఏడు జాతీయ పార్టీలు, ఇరవై నాలుగు ప్రాంతీయ పార్టీలకు మొత్తంగా వచ్చిన విరాళాల్లో రూ. 4,614 కోట్లు (28 శాతం) కార్పొరేట్‌ రంగం నుంచే రాగా...రూ. 2,634 కోట్లు (16 శాతం) ఇతర వనరుల నుంచి సమకూరాయి. ఆరేళ్లలో ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన కార్పొరేట్‌ విరాళాలు 152% మేర పెరిగాయని వెల్లడించింది. ఈ ఆరేళ్ల కాలంలో అత్యధికంగా (రూ. 4863 కోట్లు) విరాళాలు 2019-20 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే వచ్చాయని చెప్పింది. 2018-19 లో రూ. 4041 కోట్లు, 2021-22లో రూ. 3826 కోట్ల విరాళాలు రాజకీయ పార్టీలకు వచ్చాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ), సీపీఐలకు 100 శాతం ఇతర వనరుల ద్వారా విరాళాలు అందాయి. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో రూ. 20 వేల కంటే తక్కువ ఉంటే దాతలకు సంబంధించిన వివరాలను ఆయా పార్టీలు వెల్లడించనవసరం లేదు. 


ప్రాంతీయ పార్టీల్లో డీఎంకే టాప్​..


అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)​  అంతకుముందు ప్రకటించిన నివేదికలో ఎలక్టోరల్​ బాండ్స్​ రూపంలో తమిళనాడుకు చెందిన డీఎం​కే (ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీకి భారీగా విరాళాలు అందినట్లు ఏడీఆర్ తెలిపింది. 2021-22 మధ్య దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలలో డీఎం​కే రూ. 318 కోట్ల విరాళాలతో అగ్రస్థానంలో నిలిచింది. రూ. 307 కోట్లతో ఒడిశాకు చెందిన బీజేడీ (బిజూ జనతా దళ్), రూ. 218 కోట్లతో బీఆర్​ఎస్(భారత్​ రాష్ట్ర సమితి)​ తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు దేశంలోని 10 ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా.. రూ. 852 కోట్ల విరాళాలు వచ్చినట్టు.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)​ గణాంకాలు వెల్లడించాయి.