Warangal Politics : కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు వరంగల్ కేంద్రంగా సాగుతున్నాయి. ఇటీవల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. రెండు పార్టీల అధ్యక్షులు ప్రజల్ని కలుస్తూ వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం కట్టపెట్టాలంటూ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై ముఖ్యంగా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు సమస్యలు తీర్చడం లేదంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు. సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందాలంటే తమకు అధికారం అప్పజెప్పాలంటూ ప్రజలను వేడుకున్నారు. ఈ క్రమంలోనే కార్నర్ మీటింగ్ లు, మాట ముచ్చట పేర్లతో జన సమీకరణ సైతం చేశారు. సభలో ప్రసంగించిన నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడంతోపాటు, నాయకుల వ్యక్తిగత వ్యవహారాలను సైతం బహిరంగంగానే విమర్శలు చేసారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారమే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.


రేవంత్ రెడ్డి యాత్రతో పొలిటికల్ హిట్


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 6న మేడారం సమ్మక్క సారలమ్మల సన్నిధి నుంచి హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించారు. మొదటగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లలో జోడో యాత్రను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత జోడో యాత్ర పార్లమెంట్ సెగ్మెంట్ గా వరంగల్ పార్లమెంట్ ను ఎంచుకున్నారు. అందులోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గాన్ని మొదట ఎంపిక చేసుకున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 26 వరకు వరంగల్ ఎంపీ సెగ్మెంట్ లో యాత్ర ఉండగా...ఫిబ్రవరి 15న పాలకుర్తి నియోజకవర్గంలో జోడో యాత్ర పూర్తి చేసుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై విరుచుకుపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భూ దందాతో పాటు, ఇసుక దందా నిర్వహిస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అలాంటి వ్యక్తికి మళ్ళీ అవకాశం ఇవ్వొద్దు అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. పాలకుర్తి సభలో రేవంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును మోసం చేసి పార్టీ జెండాను తెలంగాణలో లేకుండా చేశారని విమర్శించారు. కోవర్ట్ రాజకీయాలు చేస్తూ 2014 ఎన్నికల్లో టీడీపీని నాశనం చేసి, కేసీఆర్ ను సీఎం చేయడానికి  దయాకర్ రావే సహకరించాడన్నారు. దయాకర్ రావును చిత్తుగా ఓడిస్తేనే తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మ గౌరవం నిలబడుతుందని పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా ఎర్రబెల్లి దయాకర్ రావును నమ్మితే తప్పకుండా మోసం చేస్తారని, బంధువులనే రాజకీయాల నుంచి తప్పించిన ఎర్రబెల్లికి ఎవరు అతీతం కాదననీ....కేసీఆర్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.  అన్ని చేసిన చంద్రబాబునే ముంచిన దయాకర్ రావు భవిష్యత్తులో కేసీఆర్ కిడ్నీలను కూడా ఎత్తుకెళ్తాడని ఎద్దేవా చేశారు. అయితే రేవంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి పై చేసిన వ్యాఖ్యలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో తీవ్ర దుమారమే రేపుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి రాజకీయ నేపథ్యంపై రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు మాత్రం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎర్రబెల్లిని డిఫెన్స్ లో పడేసినట్లు చెబుతున్నారు.


ఎర్రబెల్లి దయాకరరావుపై ఉమ్మడి జిల్లాలో చర్చ


తనకు రాజకీయంగా పోటీకి వస్తే ఎంతటి వారినైనా ఎర్రబెల్లి జీరో చేస్తారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటని చర్చలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ ఖమ్మం బహిరంగ సభ జన సమీకరణ సమావేశాల్లో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి 20, 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారెంటీ అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని వారిని మార్చాలంటూ వ్యాఖ్యానించారు. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎందుకోసం చేశారని చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో అంతర్గతంగా నడుస్తోంది. ఎర్రబెల్లి మార్చాలనుకున్న సిట్టింగ్ స్థానాల్లో వరంగల్ నుండి ఇద్దరు ఉద్యమకారులు ఉన్నారని, వారు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి రేసులో ముందుంటారని....అందుకే వారిని పక్కన పెట్టడానికే ఆ వ్యాఖ్యలు చేశారని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మేల్యేలు సైతం వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవికి పోటీ పడనున్నారని అందుకే నలుగురు సిట్టింగ్ స్థానాలను మార్చాలని ఎర్రబెల్లి భావిస్తున్నారని చర్చలు నడుస్తున్నాయి. ఓకె జిల్లా నుండి రెండు మంత్రి పదవులు కష్టం కాబట్టి, తన మంత్రి పదవికే ఎసరోస్తుందని వ్యూహాత్మకంగానే మంత్రి వ్యవహరించారని టాక్ నడుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలను మంత్రి ఎర్రబెల్లితో, సీఎం కేసీఆర్ కావాలనే చేయించారని మరికొంతమంది భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే మంత్రి పదవికి పోటీలో ముందుండడమే కాకుండా, మంత్రి పదవి ఇవ్వకుంటే అసమ్మతులుగా మారి, పార్టీకి నష్టం  చేకూరుస్తారనే ఉద్దేశంతోనే వారిని కార్నర్ చేయడానికి కేసీఆర్ ఎర్రబెల్లితో ఆ వ్యాఖ్యలను చేయించినట్లుగా చర్చ నడుస్తోంది.


రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేనా?
 
రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కోవర్టు ఆపరేషన్లకు మంత్రిని ఉపయోగిస్తున్నట్లు మరో వర్గం భావిస్తోంది. టికెట్లు వద్దని చెప్పించి, మంత్రి పదవి ఆశలతో ఉన్నవారిని... చివరికి టికెట్ ఇస్తే చాలు అనే విధంగా చేయడంలో వ్యూహాత్మకంగా ఎర్రబెల్లి అడుగులు వేస్తునట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ఎర్రబెల్లిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన్ని డిఫెన్స్ లో పడేశాయని, మంత్రి వ్యవహార తీరుపై అనుమానాలు కలిగించేలా చేయడంలో రేవంత్ సఫలమయ్యారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కౌంటర్  ఇచ్చిన మంత్రిలో జోష్ పూర్తిగా తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ షర్మిల మంత్రిపై అభివృద్ధి విషయంలో విమర్శలు చేసినా... రేవంత్ మాత్రం, తన వ్యక్తిగత ఇమేజ్ పై అనుమానం కలిగేలా చేశారని.... అందుకే మంత్రి కొన్ని రోజులుగా నారాజ్ లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు తమను సైడ్ చేయడానికే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు. రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఎర్రబెల్లి కొంతమంది ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడానికి వ్యూహంతో ఉన్నట్లు గుసగుసలాడుకుంటున్నారట. ఇకనుంచి మంత్రితో మరింత జాగ్రత్తగా ఉండాలని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట.


డైలమాలో నెట్టిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు


మొత్తానికి రేవంత్ రెడ్డి ఎర్రబెల్లిపై చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలనే కాదు... ఇన్ని రోజులు తనతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలను సైతం ఆలోచనలో పడేసాయనే చర్చ మాత్రం జోరుగా నడుస్తుంది. ఎర్రబెల్లితో ఆచితూచి వ్యవహరించాలనే  రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలపైనే అందరు నేతలూ దృష్టిపెట్టారట. అయితే మంత్రి ఎర్రబెల్లి రేవంత్ వ్యవహారంలో కావాలనే డిఫెన్స్ చేస్తున్నారా? లేక సరైన సమయం కోసం వేచిచూస్తున్నారా అనేది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్న.