కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కేసీఆర్ ఫ్యామిలీకి కనక వర్షం కురిపించే కామధేనువుగా మారిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నిజామబాద్ జిల్లా టూర్‌లో భాగంగా బోధన్ నియోజకవర్గం సారంగపూర్ వద్ద ప్రాణహిత ప్రాజెక్టు 20వ ప్యాకేజ్ పాయింట్‌ను పరిశీలించి అక్కడి రైతులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. కేసీఆర్ దమ్ముంటే బహిరంగంగా చర్చకు రెడీ కావాలని అన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై శ్వేత ప్రత్రం రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నచోట ధనదాహానికి ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు.  


కాళేశ్వరం అనేది అద్భుతమైన సృష్టి అని సీఎం కేసీఆర్ అపోహలు కల్పించారు అన్నారు రేవంత్ రెడ్డి. 100 కోట్ల రూపాయల ప్రకటనలతో మానవుడు సృష్టించిన అద్భుతంగా కాళేశ్వర ప్రాజెక్టును చూపించారన్నారు. నీటి ఆధారిత ప్రాంతం నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ రైతుల్ని ప్రోత్సహించటానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని ప్రాజెక్టుల్ని కట్టించారని గుర్తు చేశారు. 3 లక్షల ఎకరాలకు నీరందే విధంగా నాటి కాంగ్రెస్ ప్రాజెక్టులు మొదలు పెట్టిందన్నారు. రూ. 1200 కోట్ల వ్యయంతో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్ట్.. 21వ ప్యాకేజీని రూ. 900 కోట్లతో పూర్తి చేసిందని తెలిపారు. రూ. 3 కోట్లకు మిగిలిన పనిని రూ. 300 కోట్లు అంచనాలు పెంచి.. భూమి సేకరణ చేసిందని ధ్వజమెత్తారు. ఆయకట్టు అదనంగా ఒక్క ఎకరా కూడా పెరగకపోగా.. అన్యాయంగా ఇక్కడి నేతల ధనదాహం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. కమీషన్‌లు వచ్చే అవకాశం ఉన్న డబ్బులు దండుకోవటానికి కోసం ప్రాజెక్టులను రీ డిజైన్ చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని అన్నారు రేవంత్ రెడ్డి. 


ప్రాణహిత - చేవెళ్ల 20వ ప్రాజెక్ట్ అంచనా వ్యయం విలువ రూ. 800 కోట్లు.. 70 శాతం 2014లొనే కాంగ్రెస్ పూర్తి చేసిందన్నారు రేవంత్. 30 శాతం రూ. 20 కోట్లతో పూర్తయ్యేదన్నారు. ఆ 30 శాతం పనులు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు నీరు అందిచవచ్చని తెలిపారు. కానీ ఈ పనులను ఇంకా పెండింగ్‌లోనే పెట్టారని అన్నారు రేవంత్ రెడ్డి. సీఎం చంద్రశేఖర్‌రావు దోపిడీకి ప్రాణహిత - చేవెళ్ల అన్యాయమై పోయిందని... ఉమ్మడి రాష్ట్రంలో జరగని వివక్ష తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని అన్నారు. 


జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ హయాంలో 70 శాతం చేసిన పనులు చివరిలో ఉన్న పనులు నిలిపి వేసి ప్రజలకి చంద్రశేఖర్ రావు అన్యాయం చేస్తున్నారు అని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నిర్లక్ష్యం ఖరీదు వేల కోట్ల అదనపు భారం ఖజానాపై పడుతుందని అన్నారు. ఇప్పుడు ఉన్న మిషనరీ అంతా  పాడైపోతే అన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్పెషల్ టాస్క్ఫోర్స్‌ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పరిగణించి నిలిచిపోయిన, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పనులు డే అండ్ నైట్ పని చేసి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.