TTD Chariman:  తిరుమల తిరుపతి దేవస్థానాల కొత్త చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆయనకు చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలని ఓ ప్రకటన చేశారు. దీనిపై  మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైపీ  వక్ఫ్ బిల్లుతో ముడి పెట్టి విమర్శలు కూడా చేశారు. అయితే టీటీడీలో అన్య మతస్తులు అనే అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. అన్యమతస్తుల్ని టీటీడీ నుంచి తప్పించాలని ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పటికి అది నినాదంలాగే ఉంది.


సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ప్రత్యేక డ్రైవ్


2019 వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ సమయంలో తిరుమలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి విచారణ చేశారు. అన్యమతస్తులు అని అనుమానం వచ్చిన టీటీడీ ఉద్యోగుల ఇళ్లకు కూడా వెళ్లి పట్టుకున్నారు. అంతకు ముందే మొత్తంగా 45 మంది ఉద్యోగుల్ని అప్పట్లో తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే వారు కోర్టుకెళ్లారు. తర్వాత ఎల్వీ సుబ్రహ్మణ్యం మొత్తం సంస్కరించే ప్రయత్నం చేశారు కానీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఆయనను సీఎస్ పదవి నుంచి తప్పించారు. తర్వాతా కొన్ని సందర్భాల్లో  తిరుమలలో అన్యమత ఉద్యోగులు లేకుండా చేసేందుకు ప్రయత్నించినందుకే ఆయనను తప్పించారని కొంత మంది ఆరోపణలు చేశారు.  



Also Read: Kadapa SP Transfer: కడప ఎస్పీపై బదిలీ వేటు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం వహించారనే !




2020లో తిరుమలలో అన్యమత ప్రచారం చాపకింద నీరులా విస్తరిస్తోందని  గుర్తించారు.  ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించిన టీటీడీ గతంలో విచారణలు జరిపింది.  అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు టీటీడీలోనే పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు ఉన్నారు.  ఆగ్రహం వ్యక్తం చేసిన పాలక మండలి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా సదరు వ్యక్తుల కుటుంబాలను తిరుమల నుంచి పంపించాలని అనుకున్నారు. కానీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. తర్వాత ఏమయిందో ఎవరికీ తెలియదు.


Also Read: AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే! 


కొత్త టీటీడీ చైర్మన్ సంస్కరిస్తారా ?


ఐదేళ్లుగా అన్నప్రసాదం, తిరుమల లడ్డూలో నాణ్యత లోపించిందని, తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇతర మతస్థులను టీటీడీలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించారని, మాంసాహారం, గంజాయి, మందు వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. తిరుమలకొండ పవిత్రత దెబ్బతినే ప్రమాదముందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఇప్పుటికే ప్రభుత్వం సంస్కరణలు  ప్రారంభించింది. కొత్త చైర్మన్ మరింత పట్టుదలగా ఉన్నారు. అన్యమతస్తుల్ని పక్కకు తప్పించేందుకు పట్టుదలగా ఉన్నారు. శ్రీవారిపై నమ్మకం లేని వారు స్వచ్చంద బదిలీలకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు. మొత్తంగా అన్యమత ప్రచారం లేకుండా చేస్తే పవిత్రతను చాలా వరకూ కాపాడినట్లేనని భక్తులు అనుకుంటున్నారు.