ఇప్పటికే హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ నియోజకవర్గంలో పట్టు కోసం మళ్లీ ప్రయత్నిస్తున్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. సరిగ్గా ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వదిలి  తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ల మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి నిర్ణయాల పట్ల వ్యతిరేకతతో ఉన్న కొందరు నాయకులంతా కలిసి వీణవంకలో రహస్యంగా సమావేశం కావడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు కౌశిక్ రెడ్డి వర్గం సైతం తమకు ఉన్న బలాన్ని నిరూపించుకునేందుకు హైదరాబాదులో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిజానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి మొదటి నుండి ఉద్యమకారుడిగానూ, స్థానికుడిగా మంచి పేరు ఉంది. అయితే ఎన్నికల సమయంలో ఆకస్మికంగా పార్టీలోకి మారి తరువాత ఏకంగా ఎమ్మెల్సీ పదవి కొట్టేసిన పాడి కౌశిక్ రెడ్డి పట్ల పలువురు స్థానిక నాయకులు మొదటి నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 


ఇటీవల ఈ నియోజకవర్గంలోని కీలకమైన ఇల్లంతకుంటకు చెందిన సీతారామస్వామి దేవస్థానం కమిటీలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ముఖ్య అనుచరులైన వ్యక్తులకు పదవులు కట్టబెట్టారనే విమర్శలు సొంత పార్టీ నాయకులు కార్యకర్తల నుండి వ్యక్తం అవుతున్నాయి. దీంతో స్థానిక కీలక నాయకులంతా కలిసి జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండల  స్థాయిలో సమావేశాలు రహస్యంగా ఎక్కడికక్కడ నిర్వహించుకుంటూ కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని చర్చిస్తున్నారు. అతని ఏకపక్ష నిర్ణయాల పట్ల బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏకంగా సొంత ఊరైన వీణవంక మండలంలో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ వర్గం చెందిన నేతలంతా తిరిగి చర్చలు మొదలు పెట్టి రానున్న రోజుల్లో ఎలా వ్యవహరించాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఒక  దీంతో ఒక్కసారిగా హుజరాబాద్ నియోజకవర్గంపై అధిష్ఠానం దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని ఆ పార్టీ కీలక నేతలు తెప్పించుకున్నారని  తెలుస్తోంది.


బెడిసికొట్టిన వ్యూహం
నిజానికి పాడి కౌశిక్ రెడ్డి వల్ల ఆ వర్గానికి చెందిన ఓట్లన్నీ గంపగుత్తగా తమకు పడతాయని భావనతోనే అప్పట్లో టీఆర్ఎస్ అధిష్ఠానం కౌశిక్ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చింది. యువకుడు కావడం, స్థానికంగా మంచి పరిచయాలు కలిగి ఉండడంతో అతనికి సంబంధించి అనుచరగణం అంతా కూడా తమ వెంట వస్తుందని భావించినా కూడా అలా జరగలేదు. పైగా కౌశిక్ రెడ్డి వల్ల పలుమార్లు అనేక వివాదాలు ఎదురయ్యాయి. ఎన్నికల సమయంలో ఐడీ కార్డు లేకుండా పోలింగ్ బూత్ లోకి ప్రవేశించారంటూ అప్పట్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. మరోవైపు ఈటల రాజేందర్ లాంటి బలమైన నేత పార్టీ నుండి వెళ్లిపోయిన తర్వాత హుజూరాబాద్‌లో ఆ రేంజ్‌లో ప్రభావం చూపగలిగిన నాయకుల కోసం వెతుకుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి హై కమాండ్ కి ఈ విభేదాలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. దీనిని ఏ రకంగా పరిష్కరించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.