Rajinikanth as Governor:   తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేసిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇటీవల రజనీకాంత్ తమిళనాడు గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిశారు. అయితే తన మీటింగ్‌లో రాజకీయాలేం లేవని.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వబోతున్నట్లుగా ఒక్క సారిగా గుప్పుమంది. దీనిపై అటు రజనీకాంత్ కానీ ఇటు బీజేపీ కానీ ఎలాంటి ఖండన ప్రకటనలు చేయలేదు . దీంతో నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా రాజకీయం ఫిక్సయిపోయింది. 


రజనీకాంత్ గవర్నర్ పదవి తీసుకుంటారా ? 


రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని చివరి క్షణంలో ఆరోగ్య కారణాలతో విరమించుకున్న తమిళ సూపర్ స్టా‌ర్ రజనీకాంత్‌ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు. అయితే రజనీకాంత్ విషయంలో బీజేపీ మొదటి నుంచి సానుకూలంగా ఉంది. ఆయనను పలుమార్లు పార్టీలోకి ఆహ్వానించారు. కానీ చేరలేదు. సొంత పార్టీ పెట్టాలనుకున్నా సాధ్యం  కాలేదు. అయినప్పటికీ రజనీకాంత్ విషయంలో సేవలు వినియోగించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయనను గవర్నర్‌గా నియమించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


గవర్నర్ గిరీ రాజకీయం కాదు!


గవర్నర్ పదవి రాజ్యాంగబద్దమైనది. రాజకీయాలతో సంబంధం ఉండదు. బీజేపీలో చేరాల్సిన అవసరం కూడా ఉండదు. రాజ్యాంగపరంగా గవర్నరే ప్రభుత్వాధినేత. ముఖ్యమంత్రి కాకపోయినా… ముఖ్యమంత్రి కన్నా పై పొజిషన్ సాంకేతికంగా అయినా వెళ్లవచ్చని ఆయనకు బీజేపీ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట… తమిళనాడు గవర్నర్ ను రజనీకాంత్ ను కలిసినప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని ఆయన ప్రకటించారు. ఏమీ లేకపోతే ఎందుకు కలుస్తారన్న చర్చ అప్పుడే ప్రారంభమయింది.  నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా… రజనీకి గవర్నర్ ఆఫర్ వెలుగులోకి వచ్చింది. 


తమిళనాడుపై బీజేపీ ప్రత్యేక దృష్టి !


తమిళనాడులో ఇప్పుడు పొలిటికల్ వాక్యూమ్ ఉంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ..  గ్రూపు తగాదాలతో బిజీగా ఉంది. పన్నీర్ సెల్వం.. పళనీ స్వామీ పార్టీని చీల్చే దిశగా వెళ్తున్నారు. పైగా వారిద్దరూ జనాకర్షక నేత కాదు. అన్నాడీఎంకేతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ .. ప్రస్తుతం స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. డీఎంకే ప్రభుత్వంపై పోరాడుతోంది. ఇప్పుడు రజనీ లాంటి నటుడి అభిమానుల్ని ఆకట్టుకుని ఓటు బ్యాంక్‌ను సృష్టించుకుంటే..ప్రధానమైన పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుందని  అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే ఈ  ఫలితాలను పొందవచ్చన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.  


దక్షిణాదిన పార్లమెంట్ సీట్లు పెంచుకోవడంపై దృష్టి !


దక్షిణాదిన పార్లమెంట్ సీట్లు పెంచుకోవడం ఇప్పుడు బీజేపీకి కీలకంగా మారింది. హిందీ రాష్ట్రాల్లో ప్రతీ సారి వందకు వంద సీట్లు సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అక్కడ కోత పడే సీట్లను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలి. ఈ క్రమంలో తమిళనాడులో రజనీకాంత్ కోసం గతంలో ప్రయత్నించి విఫలమయింది. ఆయన అసలు రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా ఆయన అభిమానుల్ని ఆకట్టుకుని రాజకీయంగా ఎదగాలని బీజేపీ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రజనీ గవర్నర్ పదవిని అంగీకరిస్తే తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు ఖాయమని భావించవచ్చు.