AP BRS : ఏపీలో బీఆర్ ఎస్ రాకతో ఎవరికి నష్టమో తెలియదు కానీ లాభపడే పార్టీ మాత్రం హస్తమేనన్న టాక్ వినిపిస్తోంది. అదెలా అన్న దానిపై కూడా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు కెసిఆర్. అలాగే పార్టీ విస్తరణలో భాగంగా ముందు ఏపీపైనే కన్నేశారు. కర్నాటక ఎన్నికల బరిలో దిగుతారనుకుంటే ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పార్టీ ఆవిర్భావ సభ, నేతల పరిచయం తదితర కార్యక్రమాలను భారీ ఎత్తున చేసేందుకు బీఆర్ ఎస్ పార్టీ సమాయాత్తమవుతోంది.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ వల్ల లభాపడేదెవరు ? నష్టపోయేదెవరు ?
ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ని బీఆర్ ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు కెసిఆర్. త్వరలోనే మిగిలిన అన్ని శాఖలకు సంబంధించిన టీమ్ ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ వేదిక నుంచే బీఆర్ ఎస్ మేనిఫెస్టో కూడా ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ ఎస్ రాకతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అంతేకాదు కెసిఆర్ వ్యూహంలో ఎవరు చిక్కుకుంటారు ..ఎవరు లాభపడతారు అన్నదానిపై జోరుగా బెట్టింగ్ లు, చర్చలు కూడా నడుస్తున్నాయి. విపక్షాలు ఈ విషయంలో కాస్తంత దూరంగా ఉంటే అధికారపార్టీ మాత్రం మాకెలాంటి భయమూ లేదన్న విషయాన్ని స్ఫష్టం చేసింది.
బీఆర్ఎస్ రాకతో కాంగ్రెస్ పుంజుకుంటుందా?
ఇంకోవైపు బీఆర్ ఎస్ పార్టీ రాకతో కాంగ్రెస్ కి లాభమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణం హస్తం పార్టీనేనని ప్రజల్లో మనస్సుల్లో నిలిచిపోయింది. ఫలితంగా దాదాపు 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ జాడ ఏపీలో కనిపించకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు చివరకు పంచాయతీ ఎన్నికల్లోనూ ఆపార్టీ ఊసే లేకపోవడంతో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి ఊపిరిపోస్తోంది బీఆర్ ఎస్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కెసిఆర్ రాకని పలు సంఘాలు ఆహ్వానించాయి. దీంతో ఏపీలోనే మొదటగా పార్టీ విస్తరణని ప్రారంభిస్తోన్న కెసిఆర్ త్వరలోనే రాష్ట్రానికి రానున్నారు. ఆయన తెలంగాణ సిఎం హోదాలో వస్తారా లేదంటే బీఆర్ ఎస్ అధ్యక్షుడి హోదాలో వస్తారన్నదానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.
బహిరంగసభకు లభించే ప్రజాదరణను బట్టే బీఆర్ఎస్ బలంపై అంచనా !
త్వరలో పెట్టనున్న బహిరంగ సభకు వచ్చే జనాలను బట్టే ప్రజాదరణ కూడా ఉంటుందన్న అంచనాకు వస్తున్నారు. అంతే కాదు ఈ సభ సక్సస్ అయితే కాంగ్రెస్ కూడా తిరిగి ఏపీలో పూర్వ వైభవం అందుకునే అవకాశాలూ లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాహుల్ పాదయాత్రతో రాయలసీమ కాంగ్రెస్ లో జోష్ కనిపించింది. ఇప్పుడు బీఆర్ ఎస్ సభ సక్సెస్ అయితే కాంగ్రెస్ కి కూడా ప్రజల ఆదరణ ఉంటుందన్న నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉన్నాయట. అందుకే బీఆర్ ఎస్ సభ విజయవంతం కావాలని అన్ని పార్టీల కన్నా కాంగ్రెస్సే ఎక్కువగా కోరుకుంటోందన్న సెటైర్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. సభలు, సమావేశాలకు జనాలు వచ్చినంత మాత్రానా ఓటింగ్ రూపంలో అవి మారతాయన్న నమ్మకం లేదన్న విషయాన్ని పార్టీలు గుర్తుంచుకుంటే మంచిదని రాజకీయనిపుణులు సలహా ఇస్తున్నారు.