Three Capitals Supreme Court :  రాజధానిగా అమరావతినే కొనసాగించి రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి ప్రభుత్వం  చాలా ఆలోచించింది. ఆ ఆలోచన వ్యూహాత్మకమా.. లేకపోతే మరో ప్లానా అన్న విషయం పక్కన పెడితే.. అటు సుప్రీంను ఆశ్రయించకుండా.. ఇటు మూడు రాజధానులు ఖాయమన్న ప్రకటనలు చేస్తూ ఉంటే  ప్రభుత్వంలోనూ గందరగోళం ఉంటుంది. ప్రజల్లో అంత కంటే సందిగ్దత ఉంటుంది. దానికి ముగింపు పలికాల్సి ఉంది. అందుకోసం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని అనుకోవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టులో రానున్న తీర్పే కీలకం. మూడు రాజధానుల రాజకీయ క్రీడకు సుప్రీంకోర్టే ముగింపు పలకనుంది. 


అసాధారణంగా "రిట్ ఆఫ్ మాండమస్" ప్రకటించిన ఏపీ హైకోర్టు 


రాజధానిపై చట్టాలు చేసే అధికారం లేదంటూ రిట్ ఆఫ్ మాండమస్ ఇస్తున్నామని హైకోర్టు ఆనాడు తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు తాము చట్ట పరంగా చేయాల్సిన తప్పనిసరి విధులను చేయకపోతే.. ఆ పనులను చేసి తీరాల్సిందే అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరి ఆదేశాలను రిట్ ఆఫ్ మాండమస్ అంటారు. మాండమస్ అంటే చేసి తీరాల్సిందే అని అర్థం. అయితే మాండమస్ అనేది అన్ని సందర్భాల్లోనూ కోర్టు ఇవ్వదు. చాలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉన్నత న్యాయ స్థానాలు ఈ అత్యున్నత అధికారాన్ని ఉపయోగిస్తాయి. మాండమస్ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టుల చిట్టచివరి అస్త్రంగా చెప్పవచ్చు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మాండమస్‌ను జారీ చేస్తాయి.ఏపీ హైకోర్టు దీన్ని ఉపయోగించుకుంది. 


రైతులతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘించడం వల్లనే ఆ తీర్పు !


ప్రభుత్వం రాజధాని కోసం భూములివ్వమని పిలుపునివ్వగానే  34,281 ఎకరాలను రైతులు రాజధాని అమరావతి కోసం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నిర్దేశిత అవసరాలకు మాత్రమే భూమిని వినియోగించాలి.   రాజధాని కోసం సమీకరించిన భూములను రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధికి తప్ప.. తాకట్టు పెట్టడానికి, వాటిపై మూడో వ్యక్తి కి హక్కులు కల్పించకూడదు. మొత్తం 29,754 మంది రైతులు భూసమీకరణలో 33,771 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారు. వారికి ఇతర ప్రయోజనాలతోపాటు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజారాజధాని నిర్మిస్తాం, అందులో నివసిస్తారని ప్రభుత్వం చెప్పింది. ఈ కేసుల్లో 93 శాతం పిటిషనర్లు చిన్న, సన్నకారు రైతులు. వారి జీవనాధారం దెబ్బతింటున్నప్పుడు కోర్టు మౌనసాక్షిగా ఉండాలా? అధికారాన్ని ఉపయోగించాలా? ఈ కేసుల్లో రైతులు హుందాగా జీవించే హక్కును ప్రభుత్వం లాగేసుకుంది. మళ్లీ మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడుతోంది.  ఈ ఒప్పందం ప్రకారం సమీకరించిన భూమిని అభివృద్ధి చేసి రాజధానిలో ప్లాట్లను రైతులకు అప్పగించాలి. ఇందుకుగాను ఎకరాకు 3,400 చదరపు గజాలు సీఆర్‌డీఏ వద్దే ఉంటుంది. ఏదైనా షరతు ఉంటే తప్ప కాంట్రాక్ట్‌ను రద్దు చేయడానికి వీల్లేదు. అయితే అసలు సీఆర్డీఏ చట్టాన్నే రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. దీంతో చివరికి హైకోర్టు వారి హక్కుల రక్షణ కోసం..  "రిట్ ఆఫ్ మాండమస్"  ప్రకటించింది. 


స్టే ఇస్తే చాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం !


ఇలా రిట్ ఆఫ్ మాండమస్ ఇవ్వడాన్ని శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. చట్టాలు చేయడానికి శాసన వ్యవస్థకు రాజ్యాంగం అన్ని అధికారాలు ఇచ్చిందని, అలాంటప్పుడు శాసన వ్యవస్థ అధికారాల్లో న్యాయవ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నిస్తోంది.  విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. మొత్తంగా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ఆరోపించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తక్షణం స్టే ఇవ్వాలని కోరుతోంది. ప్రభుత్వ పిటిషన్‌తో ఏకీభవించి  సుప్రీంకోర్టు స్టే ఇస్తే..  తక్షణం మూడు రాజధానుల బిల్లు పెట్టి ప్రభుత్వం ఆమోదింప చేసుకుని ప్రభుత్వం తమ పట్టుదల నెగ్గించుకునే అవకాశం ఉంది. 


సుప్రీంకోర్టు ..  హైకోర్టు తీర్పును సమర్థిస్తే మూడు రాజధానుల ముచ్చటకు ముగింపు పలికినట్లే !


అయితే సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును సమర్థిస్తే మూడు రాజధానుల వాదనకు ముగింపు పలికినట్లే. న్యాయనిపుణులు న్యాయం రైతుల వైపే ఉందని చెబుతున్నారు. ఎదుకంటే రైతులతో ప్రభుత్వం చట్టబద్ధమైన ఒప్పందం చేసుకుంది. ఒక్ వేళ ఆ ఒప్పంద నుంచి బయటకు రావాలంటే భారీగా పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతే కానీ రైతుల్ని అలా వదిలేసి వారి భూముల్ని ప్రభుత్వం  వేలం వేసుకుని.. లేకపోతే తాకట్టు పెట్చుకునే అవకాశం పొందలేదు. అదే సమయంలో  గతంలో రాజదానిని ఏకాభిప్రాయంతో నిర్ణయించారు. ఆ నిర్ణయంలో జగన్ కూడా  భాగస్వామి.. హైకోర్టు తన తీర్పులో ఇదే విషయాన్ని వెల్లడించింది. అందుకే  అమరావతి రైతులు కూడా హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని సమర్థిస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ ధర్మమే గెలుస్తుందని ప్రభుత్వ కుట్రలకు ముగింపు  ఉంటుందంటున్నారు. ఎలా చూసినా మూడు రాజధానుల వివాదం సుప్రీంకోర్టులోనే తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.