AP BJP Politics : " గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఒకప్పుడు బీజేపీకి ఒక్క సీటే ఉండేది. ఇప్పుడు గుజరాత్ , కర్ణాటకల్లో తిరుగులేని రాజకీయాధికారం సాధిస్తున్నాం. కానీ ఏపీలో మాత్రం ముందడుగు వేయలేకపోయాం " అని ప్రధాని మోదీ ఏపీ బీజేపీ కోర్ కమిటీతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు. నిజమే.. బీజేపీ ఒకప్పుడు దేశవ్యాప్తంగా రెండే లోక్‌సభ సీట్లతో ప్రయాణం ప్రారంభించింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ బలపడుతోంది. కానీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా పరిస్థితి మారింది. ఎందుకిలా జరుగుతోంది ? లోపం రాష్ట్ర నాయకుల్లో ఉందా ? జాతీయ పార్టీ ప్రయోజనాల కోసం ఏపీ బీజేపీని కేంద్ర నాయకులు ఎదగకుండా చేస్తున్నారా ?
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ముందుకు.. ఏపీలో వెనక్కి !
ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి కొంత మేర బలం ఉండేది. అయితే సీట్లుగా మారే బలం మాత్రం చాలా తక్కువ. బలమైన లీడర్‌ా ఉన్న కిషన్ రెడ్డి మాత్రమే గెలుస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కొన్ని మెరుగైన సీట్లు వచ్చేవి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ మొదటి ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎక్కువ సీట్లలో టీడీపీకే చాన్సిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం.. ఒంటరిగా పోటీ చేసి అధికారం సాధించుకుంటామన్నంత బలమైన స్థానానికి వచ్చారు. కానీ ఏపీలో మాత్రం రివర్స్ అయింది. ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ తెచ్చుకునే బలం లేదు. సొంత బలంతో డిపాజిట్ తెచ్చుకునే నేతలు కూడా లేరు. ఫలితంగా ఏపీలో బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్లకు పడిపోయింది.
బలమైన నేతలు లేరు.. వచ్చిన వాళ్లను కాపాడులేకపోయారు !
ఏపీ బీజేపీలో బలమైన ప్రజానేతలు లేరు. ఉన్న వారంతా పార్టీ మీద ఆధారపడేవారే. అందుకే విజయం బీజేపీ దగ్గరకు చేరడంలేదు. బీజేపీ మోదీ, షాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో బలహీనంగా ఉన్న చోట్ల బలోపేతం చేసుకున్నారు. కానీ ఏపీలో అలా వచ్చి చేరిన వారిని కూడా కోవర్టులనే ముద్ర వేసి దూరంగా పెట్టడంతో మొదటికే మోసం వచ్చింది. చివరికి కన్నా లక్ష్మినారాయణ, ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ లాంటి నేతలు వచ్చినా బీజేపీలో యాక్టివ్ రోల్ తీసుకోలేకపోయారు. పాతుకుపోయిన నేతలు జనాల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయలేకపోయారు. ఫలితంగా బీజేపీ ముందడుగు వేయలేకపోతోంది.
జాతీయ రాజకీయాల కోసం ఏపీ పార్టీని ఎదగకుండా చేస్తున్న కేంద్ర నాయకత్వం!
అయితే ఏపీ బీజేపీ ఎదగలేకపోవడానికి రాష్ట్ర నాయకులే కారణం కాదు.. కేంద్ర నాయకత్వం కూడా అంతే కారణం. ఢిల్లీలో ప్రభుత్వ అవసరాల కోసం.. ఏపీలో ప్రాంతీయ పార్టీలతో పరోక్షంగా అయినా సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కొన్ని సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం.. కొన్ని సార్లు వైఎస్ఆర్‌సీపీ లాంటి పార్టీలతో అంతర్గత అవగాహనతో పోరాటాలు చేయకుండా ఉండటంతో సమస్య జఠిలమవుతోంది. అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ విఫలమయిందన్న అభిప్రాయాన్ని మోదీ వినిపించారు.. కానీ వైఎస్ఆర్‌సీపీతో ఢిల్లీలో అంత సన్నిహితంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఎలా పోరాడాలన్న అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు.
ప్లాన్డ్‌గా బీజేపీని తమ పక్షంగా చూపించుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ !
విశాఖలో మోదీ సభ జరిగితే.. మొత్తం హడావుడి వైఎస్ఆర్‌సీపీదే. ఎవరూ నిలువరించలేదు. ఆదే సభలో ప్రధాని ప్రసంగించారు. కానీ సమీక్షా సమావేశంలో ఆయన ఇప్పటికైనా జగన్‌పై చార్జ్ తీసుకోవాలని.. గ్రామ గ్రామాన జగన్ వైఫల్యాలు.. నిర్వాకాలపై చార్జ్ షీటు దాఖలు చేసి.. ప్రజల్లో చర్చ పెట్టాలని మోదీ ఆదేశించినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఏపీ బీజేపీ నేతలు కొంత కాలంగా పోరాడుతున్నారు. ఏపీ బీజేపీ పోరాడుతున్నా.. అంతా లైట్ తీసుకోవడానికి కారణం... ఏపీలోని కొంత మంది నేతల తీరు మాత్రమే కాదు.. కేంద్రం కూడా ప్రధాన కారణమే. ప్రధాని మోదీ స్వయంగా ఇలా చార్జ్ తీసుకోవాలని తమ పార్టీ నేతలకు చెప్పారు కానీ.. తాను పల్లెత్తు మాట అనలేదు. ఇక బీజేపీకి వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకమని ప్రజలు ఎలా అనుకుంటారు. అందుకే కేంద్ర బీజేపీనే తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎలా శత్రువుగా ప్రకటించారో అలా ప్రకటించి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే..అప్పుడు రాష్ట్ర నేతలు.. ఏదో విధంగా అందుకుంటారు. కేంద్ర బీజేపీ సహకారం లేకపోతే.. ఏపీ బీజేపీ ఎప్పటికీ ఎదగదు. ఇలాగే ఉండిపోతుంది.