Case On Pawan :  పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావటం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది.ఈ వ్యవహారం సంచలనంగా మారటంతో అటు పోలీసులు, ఇటు ఫిర్యాదు దారుడు కూడా జాగ్రత్తలు పాటించారు  ఫిర్యాదు చేసిన వ్యక్తి కోసం మీడియా వెతుకులాట చేపట్టింది. అయితే అధికారికంగా ఈ కేసు వ్యవహారంలో పోలీసులు వివరణ కోసం చేసిన ప్రయత్నం కూడా విఫలం అయ్యింది. తాడేపల్లి స్టేషన్ సీఐ తన ఫోన్ ను స్విఛ్ ఆఫ్ చేసుకున్నారు.  


పవన్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్..!


జనసేన అధినేత పవన్ కళ్యాణ్‍ తో పాటుగా ఆయన కారు డ్రైవర్ పై కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తాడేపల్లి పీఎస్‍లో రెండు రోజుల క్రితం నమోదయిన కేసు వివరాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పవన్‍పై IPC 336, రెడ్‍విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటం గ్రామంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లే సమయంలో పవన్  కారు పై కూర్చొని ప్రయాణించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా  వైరల్ అయ్యాయి. అయితే పవన్ కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ తో పాటుగా హైవే రహాదారిపై వెళ్లే వారికి కూడా ఇబ్బందులు కలిగాయని, తనకు కూడా కారు తగిలిందని ఫిర్యాదు చేస్తూ తెనాలి మారిస్ పేటకు చెందని శివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ  ఎఫ్ఐఆర్ మోదీ పర్యటన పూర్తయిన తరువాత వెలుగులోకి రావటం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది.  


ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న పోలీసులు 


పోలీసులు ఏదైనా పెద్ద కేసు నమోదు చేసినప్పుడు మీడియాకు సమాచారం అందిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం సమాచారం బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారని అందులో భాగంగానే కేసు నమోదు చేసిన సమాచారాన్ని బయటకు రాకుండా చర్యలుతీసుకున్నారని అంటున్నారు. అయితే  ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఐ శేషగిరిని సంప్రదించేందుకు మీడియా ప్రయత్నించింది.  ఆయన ఫోన్ ను స్వీచ్ ఆఫ్ చేసుకున్నారు. అంతే కాదు పోలీసులకు ఫిర్యాదు చేసిన శివ అనే వ్యక్తి కూడా గ్రామం విడిచి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఫిర్యాదు తరువాత కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి రక్షణ కల్పించే అంశంలో భాగంగానే ముందు జాగ్రత్తగా వేరొక ప్రాంతానికి వెళ్లాల్సిందిగా సూచించినట్లు చెబుతున్నారు.


కేసు నమోదులో పోలీసులపై ఒత్తిడి...!


పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు వ్యవహారం రాజకీయ కోణంలో జరిగిందనే ప్రచారం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లిన సమయంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంతే కాదు పవన్ ఇప్పటం వెళుతుండగా పోలీసులే  జనసేన కార్యాలయం ముందు పవన్ ను అడ్డగించేందుకు ప్రయత్నించారు. దీంతో పవన్ నడుచుకుంటూ అయినా సరే వెళ్లి తీరతాననంటూ కార్యాలయం నుండి బయటకు వచ్చారు. దీంతో గత్యంతరం లేని పరిస్దితుల్లో పోలీసులు పవన్ కు అనుమతి ఇచ్చారు.  ఆ తరువాత పవన్ తన వాహనం పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటూ, అలానే ఇప్పటం వరకు వెళ్ళారు. ఆ రోజే పోలీసులు రెచ్చగోట్టేలా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా పవన్ పై ఆలస్యంగా కేసు నమోదు చేయటం, నమోదు అయిన కేసు వివరాలను కూడా బయటపెట్టేందుకు రెండు రోజులు ఆలస్యం చేయటం వెనుక పూర్తి రాజకీయ కోణంలోనే జరిగిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు కూడా ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్దితి నెలకొందని అంటున్నారు.