Himachal Election 2022:


గూగుల్ వీడియో 


హిమాచల్‌ప్రదేశ్‌లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా గూగుల్‌ స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యాంశరణ్ నేగికి నివాళి అర్పించింది. డూడుల్‌ వీడియో రూపంలో ట్రిబ్యూట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లోనూ శ్యాంశరణ్ నేగి ఓటు వేశారు. నవంబర్ 2వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న నేగి..నవంబర్ 5న తేదీన కన్నుమూశారు. బతికున్నంత కాలం ఏ ఎన్నిక జరిగినా తప్పకుండా ఓటు వేశారు నేగి. ఇటీవలే 34వ సారి ఓటు వేసి రికార్డు సృష్టించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయనను గుర్తు చేసుకుంటూ గూగుల్ 2 నిముషాల వీడియో రూపొందించింది. "స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యాం శరణ్ నేగిని స్మరించుకుందాం. ఓ పౌరుడిగా మన బాధ్యతలు నిర్వర్తించాలని బలంగా అనుకుంటే మన దారిలో ఎలాంటి అడ్డంకులు రావన్న పాఠం నేర్పారు" అని ట్వీట్ చేసింది గూగుల్. అప్పట్లో షాంతాంగ్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయడం ఎంత కష్టంగా ఉండేదో  ఈ తరం వాళ్లకు ఎన్నో సార్లు వివరించారు నేగి. అత్యంత ఎత్తైన ఆ ప్రాంతానికి చేరుకునేందుకు 10 రోజులు ముందుగానే బయలుదేరి ట్రెకింగ్ చేసే వాళ్లమని చెప్పేవారు. 1951లో పోలింగ్ టీమ్‌ సభ్యుడిగా పని చేశారు శ్యాం శరణ్.






ఎన్నికల ప్రక్రియల్లో వచ్చిన అన్ని మార్పులనూ చాలా దగ్గర నుంచి గమనించారు శ్యాం శరణ్. బ్యాలెట్ పేపర్‌పై స్టాంప్‌లు వేసినప్పటి నుంచి EVM,VVPATలు అందుబాటులోకి వచ్చేంత వరకూ అన్ని విధానాల్లోనూ ఓటు వేశారు. ఎప్పుడూ కూడా ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేయలేదు. పంచాయత్, అసెంబ్లీ, పార్లమెంట్..ఇలా ఏ ఎన్నిక జరిగినా ఎప్పుడూ మిస్ అవకుండా ఓటు వేసేవారు శ్యాం శరణ్. మరో విశేషం ఏంటంటే.. 2014లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం ఆయను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలని కోరింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో సమయంలోనూ Google ఆయనపై ఓ వీడియో క్రియేట్ చేసింది. #PledgeToVote క్యాంపెయిన్‌లో భాగంగా ఈ వీడియో విడుదల చేయగా...ప్రపంచమంతా ఆయన పేరు మారు మోగింది. 


డిసెంబర్ 8న ఫలితాలు..


హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. హిమాచల్‌లో భాజపా అధికారంలో ఉంది. ఈ సారి కూడా కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది కాషాయ పార్టీ. 88 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో 2017లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు భాజపా అధికారంలోకి రాగా...జైరామ్ ఠాకూర్ సీఎం అయ్యారు. 


Also Read: TMC Minister Akhil Giri: రాష్ట్రపతిపై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు, అరెస్ట్ చేయాలంటున్న బీజేపీ