TMC Minister Akhil Giri: 


అఖిల్ గిరి అభ్యంతరకర వ్యాఖ్యలు..


రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "నేను అందంగా లేనని సువేందు అధికారి నన్ను కించపరిచారు. ఆయన మాత్రం అందంగా ఉన్నాడా..? ఎవరినైనా సరే ఆహార్యాన్ని బట్టి జడ్జ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. రాష్ట్రపతి అంటే మాకెంతో గౌరవం ఉంది. కానీ ఆమె చూడటానికి ఎలా ఉంటారు?" అని చుట్టూ ఉన్న వారిని అడిగారు. అక్కడి జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఇప్పుడీ కామెంట్స్‌పైనే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా కించపరచడం ఏంటి అని మండి పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్ అమిత్ మాలవియా విమర్శించారు. "మంత్రి అఖిల్ గిరి రాష్ట్రపతిని అవమానించారు. మమతా బెనర్జీ గిరిజన వ్యతిరేకి. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవటం ఆమెకు ఇష్టం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు" అని మండిపడ్డారు.










పశ్చిమ బెంగాల్‌ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకి సిద్ధమవుతోంది. "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందిన వారు. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ కూడా మమతా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. "మమతా బెనర్జీ ఎప్పుడూ గిరిజన వ్యతిరేకిగానే ఉన్నారు. ఆమె క్యాబినెట్‌లోని మంత్రి అఖిల్ గిరి ఆమెను మించిపోయారు. గిరిజనులంటే వాళ్లకెందుకంత ద్వేషం" అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్...జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. వెంటనే అఖిల్ గిరిని అరెస్ట్ చేయాలని అందులో కోరారు. "ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించే విషయం కూడా ఆలోచించండి" అని విజ్ఞప్తి చేశారు. 






గతంలో అధిర్ రంజన్..


గతంలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌధ‌రి రాష్ట్ర‌ప‌తిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం వల్ల క్షమాపణలు చెప్పారు. అధీర్ రంజన్ చౌధురి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి 'రాష్ట్రపత్ని' అనటం అప్పట్లో తీవ్ర వివాదస్పదమైంది. పార్లమెంట్ ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. తరవాత అధిర్ రంజన్ వివరణ ఇచ్చారు. 


" నేను మాట్లాడిన మాట తప్పైతే ఉరితీయండి. అంతే కానీ భాజపాకి మాత్రం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు  ప్రదర్శనగా వెళ్తున్నప్పుడు ఆవేశంలో ఓ మాట వచ్చింది. దాన్ని టెలికాస్ట్ చేయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు భాజపా రాద్దాంతం చేస్తోంది.                         "
-అధీర్ రంజన్ ఛౌదురి, కాంగ్రెస్ నేత 


Also Read: Twitter suspends $8 subscription: మస్క్‌ మామ తిక్క కుదిరింది, $8 సబ్‌స్క్రిప్షన్‌ తక్షణం రద్దు చేసిన ట్విట్టర్‌