Telangana Politics changed with the cry of women BRS MLAs : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, చర్చలు అర్థవంతంగా సాగుతూండటం.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త కొత్తగా అనిపించింది.  గత పదేళ్లుగా చట్టసభలు ఏ మాత్రం సానుకూలంగా సాగలేదు. ఏపీతో పాటు తెలంగాణలోనూ అదే పరిస్థితి. ఈ కారణంగా అసెంబ్లీలో చర్చలు జరగుతున్న వైనం అందర్నీ ఆకర్షించింది. ఓ సారి తెల్లవారుజామున మూడున్నర వరకూ చర్చించేశారు. అయితే ఈ స్ఫూర్తి ఒక్క రోజునే అడుగంటిపోయింది. బుధవారం అసెంబ్లీలో జరగిన పరిణామాలతో సభలో రాజకీయ వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో చర్చ పక్కదారి పట్టింది. హడావుడిగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించాల్సి వచ్చింది. అంతటితో ఆగలేదు.. సభ బయట మహిళా ఎమ్మెల్యేలు కంట తడి పెట్టడం.. వెంటనే రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునివ్వడంతో ఈ రాజకీయం రోడ్డెక్కుతోంది.  


అక్కలపై రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయం బీఆర్ఎస్ వ్యూహాత్మకం ! 


తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలు  తనను ఇద్దరు అక్కలు మోసం చేశారని వారిని నమ్మితే జూబ్లీ బస్టాండేనని సీఎం రేవంత్  యథాలాపంగా అన్న మాటలతో   బీఆర్ఎస్ వ్యూహం మార్చింది.  రేవంత్ ఆ మాటలు తమను ఉద్దేశించే అన్నారంటూ సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని తెర ముందుకు తెచ్చారు.  అసలు రేవంత్ ఎవరి పేర్లు చెప్పకపోయినా.. వారంతటకే వారే తెరపైకి రావడంతో  రాజకీయం మారిపోయింది. సబితా ఇంద్రారెడ్డి మైక్ తీసుకుని కాంగ్రెస్ లోకి తానే రేవంత్ ను పిలిచానని చెప్పారు.  కౌంటర్ గా రేవంత్.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు  తనను మల్కాజిగిరి నుంచి పోటీ చేయమని చెప్పి ఆమె బీఆర్ఎస్ లో చేరి.. తనను ఓడించేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఆమె వ్యక్తిగత సంభాషణల గురించి చెప్పింది కాబట్టే తాను ఇలా చెప్పానన్నారు. తర్వాత భట్టి విక్రమార్క కూడా మోసానికి మరోపేరు సబితా ఇంద్రారెడ్డి అని ..  తన సీఎల్పీ పదవి పోవడానికి సబిత ఎలా కారణమైందో చెప్పారు. భట్టి వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోని బీఆర్ఎస్ రేవంత్ మహిళా ఎమ్మెల్యేలను కించ  పరిచారని.. ఆందోళన ప్రారంభించింది. 


అక్కలను నమ్మొద్దు, కేటీఆర్‌కు రేవంత్ సూచన- సబితా సీరియస్‌- తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం


"ఏడుపు" ఎపిసోడ్‌తో రోడ్ల మీదకు వెళ్లే వ్యూహం 


ఈ వివాదం జరుగుతున్న సమయంలో రేవంత్ గవర్నర్‌కు ఆహ్వానం పలికేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంలో రేవంత్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టారు. రేవంత్ అసెంబ్లీకి తిరిగి వచ్చిన తర్వాత సభ ప్రారంభమైన తర్వాత కూడా బీఆర్ఎస్ పట్టు వీడలేదు. దాంతో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించినట్లుగా ప్రకటించి సభను వాయిదా వేశారు స్పీకర్. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా .. సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ మహిళల్ని అవమానిస్తున్నారని.. తమను ఎందురు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాసేపటికే రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. 


తాను ఏమన్నానని రేవంత్ ప్రశ్న


తానేదో వ్యాఖ్యలు చేశానని బీఆర్ఎస్ హడావుడి చేయడంపై రేవంత్ అసంతృప్తిలో ఉన్నారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన తాను అన్‌పార్లమమెంటరీ మాట ఒక్కటైనా మాట్లాడి ఉంటే చూపించాలని అన్నారు. వారిని తాను అక్కలనే సంబోదించానని అందులో తప్పేముందన్నారు. వ్యక్తిగత సంభాషణలను సబితా ఇంద్రారెడ్డి బయట పెట్టారు కాబట్టి తాను కొనసాిగంపుగా ఏం జరిగిందో చెప్పానన్నారు. సునీతా లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేసి కేసుల్లో ఇరుక్కున్నానని ఆమె మాత్రం పార్టీ మారానని అదే చెప్పానని రేవంత్ అంటున్నారు. అయితే రేవంత్ ఏమన్నారన్న సంగతి కన్నా.. ఏదో అన్నారన్న అభిప్రాయాన్ని కల్పించి... దిష్టిబొమ్మల దహనానికి పిలుపునివ్వడం ద్వారా అడ్వాంటేజ్ సాధించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. 


నన్ను, అమ్మను ఇబ్బంది పెడుతుంటే ఎక్కడికి పోయావు అన్నా - రేవంత్‌కు సూటి ప్రశ్నలు


బీఆర్ఎస్ ప్రయత్నం వర్కవుట్ అవుతుందా ? 


రాజకీయాల్లో భావోద్వేగ పూరిత అంశాలు వర్కవుట్ అయితే మంచి ఫలితాలు వస్తాయి. మహిళల్ని రేవంత్ అవమానించారని బీఆర్ఎస్ వాదనను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి సిద్ధమయింది. దానికి కాంగ్రెస్ పార్టీ తన పార్టీ మహిళా నేతలతో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీతక్కతో పాటు గత గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేస్తోంది. రేవంత్ రాజకీయంగా ప్రశ్నించారు తప్ప ఒక్క మాట కూడా నోరు జారలేదని అసలు బీఆర్ఎస్ నేతలే ఆ పని చేస్తున్నారని అంటున్నారు. పోటాపోటీగా చేసే మహిళలకు అవమానం ప్రచారంలో ఎ పార్టీ ఎక్కువ స్కోర్ చేస్తుందో కానీ.. తెలంగాణ అసెంబ్లీలో చర్చ మాత్రం.. పక్క దోవ పట్టేసింది.