Telangana Government Completed One Month: తెలంగాణ ముఖ్యమంత్రిగా (Telangana Chief Minister )రేవంత్ రెడ్డి (Revanth Reddy ) బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తయింది. నెల రోజుల పాలనతో ప్రత్యేక ముద్ర వేశారు. పాలనలోనూ, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయేలా వ్యవహరించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వడంలోనూ దూకుడుగా వెళ్లారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. ఏ యే రంగాలను నిర్లక్ష్యం చేశారో ప్రజలకు తెలిసేలా వ్యవహరించారు. నెల రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకొని పాలనపై పట్టు సాధించారు. 


ప్రగతిభవన్ పేరు మార్పు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రగతి భవన్ పేరును పూలే భవన్ గా మార్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇనుప భారీ కేడ్లను తొలగించారు. మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో.. డిసెంబరు 8న ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఇందులో ఎక్కువ శాతం ధరణితో తలెత్తిన భూసమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వినతులే వచ్చాయి. ఒకవైపు వరుస సమీక్షలు నిర్వహిస్తూనే...మరోవైపు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో రెండు భవనాలను ఇద్దరు మంత్రుల అధికారిక నివాసాలుగా కేటాయించారు. ఒకటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, రెండోది సీతక్కకు ఇచ్చారు. 


మహిళలకు ఉచిత ప్రయాణం
తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది.   ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసింది. ఫోటో గుర్తింపు కార్డు, అడ్రెస్ ప్రూఫ్ చూపించినా సరే బస్సుల్లో ప్రయాణానికి అనుమతించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ్నుంచి ఎక్కడికైనా ఆర్డీనరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. జీరో టికెట్ తో మహిలలకు ఉచిత ప్రయాణం కల్పించింది. మొదటి వారంలో ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే మహిళలు ప్రయాణించారు. 


ఆరోగ్య శ్రీ పెంపు
ఆరోగ్య శ్రీ వైద్య ఖర్చును 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఆరోగ్య శ్రీ పధకంలో 5 లక్షల వరకే ఖర్చుకు పరిమితి ఉండేది. డిసెంబరు 10 నుంచి ఈ పరిమితి 10 లక్షలకు పెరిగింది. 2004లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పధకాన్ని తొలిసారిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 77 లక్షల 19 వేలమందికి ఆరోగ్య శ్రీ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 1310 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాయి. 198 ప్రభుత్వ ఆసుపత్రులుఉన్నాయి. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పధకంలో 1376 శస్త్ర చికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి.  


ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ
రేషన్ కార్డు, పింఛన్ చేయూత, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ వంటి పథకాలకు దరఖాస్తులను స్వీకరించింది. డిసెంబరు 28 నుంచి జనవరి 6వ వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 1,25,84,383 అప్లికేషన్స్ వచ్చాయి. వీటిని ఈ నెల 17 వరకు అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.


వంద ఎకరాల్లో హైకోర్టు


తెలంగాణ హైకోర్టు కోసం రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌ మండలం ప్రేమావతిపేట, బుద్వేలలో వంద ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ భూములను వ్యవసాయ, ఉద్యాన విశ్విద్యాలయానికి 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అందులో వంద ఎకరాలను హైకోర్టు ప్రాంగణానికి రేవంత్‌ కేటయించారు.