Telangana Congress Cabinet: ప్రభుత్వం సమర్థంగా నడవాలంటే వ్యవస్థల్లో సమర్థులైన వారు ఉండాలి. ముఖ్యంగా మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఉండటంతో పాటు వారంతా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాల్సి ఉంది. లేకపోతే పాలనపై ప్రభావం పడుతుంది. పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోకపోతే రాజకీయంగానూ విమర్శలు వస్తాయి. ముఖ్యమంత్రిగా పట్టు లేదని.. అందుకే మంత్రి పదవుల్నీ ఇవ్వలేకపోతున్నారని అంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురవుతోంది. 

మరో మూడు మంత్రి పదవులు భర్తి

తెలంగాణ కేబినెట్‌లో మొత్తం పద్దెనిమిది మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. వీరిలో పన్నెండు మంది మాత్రం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏడాదిన్నర కిందట ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరు స్థానాలను ఖాళీగా ఉంచారు. వాటిని చూపించి ఎంపీ ఎన్నికల్లో ఆశావహుల్ని పరుగులు పెట్టించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగా పెట్టించారు. కానీ ఫలితం ఎనిమిది సీట్ల వద్దనే ఆగిపోయింది. ఈ ఎఫెక్ట్ తో పాటు.. మంత్రి పదవుల రేసు తీవ్రంగా ఉండటంతో ఇప్పటి వరకూ భర్తీ చేయలేకపోయారు. రెడ్డి సామాజికవర్గంలో పోటీ ఊహించనంతగా ఉంది. ఎవరికి ఇచ్చినా మరొకరు తిరుగుబాటు చేస్తారన్న భయంతో   మూడు పదవుల్ని ఖాళీగా ఉంచి మూడింటిని మాత్రమే భర్తీ చేశారు. 

పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయిన సీఎం                 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం సీఎం ప్రధాన విధి. అియతే ఇప్పటి వరకూ హోం, హోంశాఖ వంటి ప్రధాన శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి. పేరుకు ముఖ్యమంత్రి చూస్తారు కానీ ఆయనకు అంత తీరిక ఉండదు. మంత్రుల్లేని శాఖలన్నమాట. అలాంటి కీలకమైన శాఖలకూ మంత్రులు లేకపోవడం సీఎం విధి నిర్వహణలో సమస్యలు తెచ్చి పెడుతుంది. అందుకే పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం సీఎం వైఫల్యమేనంటున్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉన్నా.. మొత్తం మంత్రి వర్గాన్ని సిద్ధరామయ్య ఏర్పాటు చేసుకున్నారని కొంత మంది గుర్తు చేస్తున్నారు. 

హైకమాండ్ ఆపుతోందా? రేవంత్  ధైర్యం చేయలేకపోతున్నారా ?                    

మంత్రి పదవుల కోసం పోటీ అనేది సహజంగానే ఉంటుంది. కేబినెట్ మంత్రులపై కసరత్తు జరిగినప్పుడు కేవలం ఒక్కటి మాత్రమే ఖాళీగా ఉంచి ఐదు పదవుల్ని భర్తీ చేయాలనుకున్నారని..  వివాదాస్పదమైన ఒకరిద్దరు మంత్రుల్ని తప్పించి.. కొత్త వారికి చాన్సివ్వాలనుకున్నారన్న ప్రచారం జరిగింది.  కానీ అలాంటి పరిస్థితులు కనిపించలేదు.  తీవ్రంగా మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న వారికి చాన్స్ దక్కలేదు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాల్లో కొన్ని జిల్లాలకు మూడు పదవులు దక్కాయి కానీ.. గ్రేటర్, నిజామాబాద్ వంటి ప్రాంతాలకు ఒక్క పదవి కూడా లేదు. ఇలా సమీకరణాలను చూసుకోలేకపోవడం.. పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం రేవంత్ రెడ్డికి సమస్యగా మారింది. ఆయన పాలనపై , పార్టీపై, ప్రభుత్వంప పట్టు సాధించలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.