తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహగానాలు, అనూహ్యంగా మంత్రివర్గంతో ప్రధాని భేటీ జరుగుతున్న టైంలోనే బండి సంజయ్‌కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. 


ప్రైవేట్ మీటింగ్


ఢిల్లీ పిలిచిన అధినాయకత్వం నేరుగా ప్రైవేట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షులు కానీ, వేరే సీనియర్ నేతలు కానీ ఢిల్లీ వెళ్తే పార్టీ కేంద్రకార్యాలయానికి వెళ్తారు. కానీ ఈసారీ బండిని పిలిచిన అధినాయకత్వం ఓ ప్రైవేటు మీటింగ్ పెట్టిన సమాచారం అందుతోంది. ఆయన్ని కేంద్రమంత్రి పదవి కానీ, జాతీయ నాయకత్వంలో చోటు కాని కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతలో ఆయన్ని ఢిల్లీ పిలిపించడంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. 


ఆదివారం స్పష్టత


తెలంగాణకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడనేది ఆదివారమే స్పష్టమైంది. హన్మకొండలో పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలతో మాట్లాడుతూ.. 8న జరిగే ప్రధాని మీటింగ్‌కు తాను అధ్యక్ష హోదాలో హాజరు అవుతానో కాదో అని అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడే కీలక మార్పులు జరగబోతున్నాయని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు బండి సంజయ్‌ను ఢిల్లీ పిలవడంతో ఆయన్ని తప్పించి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వబోతున్నారని కూడా స్పష్టమవుతోంది. 


మూడు గంటలకు కిషన్ రెడ్డి ప్రెస్‌మీట్


ఈ పరిణామాలు జరుగుతున్న టైంలోనే సాయంత్రం కిషన్ రెడ్డి కీలకమై ప్రెస్‌మీట్ పెట్టబోతున్నారు. ఆయన ఈ ప్రెస్‌మీట్ దేని కోసం పెడుతున్నారనేది కూడా పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తి నెలకొంది. ఖమ్మంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై స్పందించేందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారా లేకా తెలంగాణ బీజేపీలో జరగబోయే పరిణామాలు వివరించబోతున్నారా అనేది తేలాల్సి ఉంది. 


ఎన్నికలు సమీపిస్తున్న టైంలో తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై అందరి ఫోకస్ పడింది. అధ్యక్షుడి మార్పు ఖాయమైన వేళ  ఆ పదవి ఎవర్ని వరించనుందనే డిస్కషన్ నడుస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికే ఈ పదవి కట్టబెట్టే ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్టు సమాచారం. 


హన్మకొండలో భావోద్వేగం


హన్మకొండలో జరిగే నరేంద్ర మోదీ సభకు తాను బీజేపీ అధ్యక్షుడి హోదాలో వస్తానో రానో అంటూ భావోద్వేగానికి గురయ్యారు. బండి సంజయ్‌ అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ బీజేపీ విస్తరించిందని...ఆయన పోరాటాల వల్లే పటిష్టమైందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోదార్యమని.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనన్నారు. 


బిజేపీకి త్యాగాల చరిత్ర ఉందన్నారు బండి సంజయ్‌. కార్యకర్తలెందరో జైలు పాలయ్యారని గుర్తు చేశారు. పవిత్రమైన గడ్డకు, ప్రపంచమే ది బాస్ అంటూ కీర్తించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్న వేళ కనీవినీ ఎరగని రీతిలో ఘన స్వాగతం పలికి చరిత్ర సృష్టిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేద్దామన్నారు. 


ఎప్పటి నుంచో ప్రచారం


ఎప్పటి నుంచో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను తప్పించి ఆయన స్థానంలో కిషన్‌రెడ్డికి పగ్గాలు ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి కానీ, జాతీయ కార్యవర్గంలో స్థానం గానీ కల్పించబోతున్నారని సమాచారం. ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా బండి సంజయ్‌్ ఎమోషన్ కావడం బీజేపీలో కూడా కొత్త  చర్చ మొదలైంది. అందుకే తమకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని బీజేపీ నాయకులు కూడా డిసైడ్ అయ్యారు.


Also Read: కాంగ్రెస్‌లో ఐక్యత - బీజేపీలో ముసలం ! తెలంగాణ రాజకీయాల్లో ఇదే గేమ్ ఛేంజరా ?


Also Read: తెలంగాణ బీజేపీని హైకమాండ్ ముంచుతుందా ? తేలుస్తుందా ?


                                                        Join Us on Telegram: https://t.me/abpdesamofficial