Telangana Congress :  కాంగ్రెస్ అంటే అంతర్గత రాజకీయాల పుట్ట. ఆ పార్టీ నేతలు తాము ఎవరిని ఓడించాలన్నదాన్ని సంగతిని ఎప్పుడూ పట్టించుకోరు.  తమలో తాము ఎవర్ని ఓడించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే బీజేపీ అయితే.. ముందుగా పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తారు. తర్వాత హైకమాండ్ ఎవరికి పదవి ఇస్తే వారు తీసుకుంటారు. ఇదంతా తెలంగాణ విషయంలో రివర్స్ అయిపోయింది. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ తన సహజ లక్షణాలను బహిరంగంగానే  బయట పెట్టుకుంది .. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఐక్యంగాకనిపిస్తోంది. బీజేపీ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.  


తెలంగాణ  కాంగ్రెస్‌లో చల్లబడిన అసంతృప్తి   


తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడటం లేదు.  రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన తర్వాత చాలా మంది సీనియర్లు తాము ఆయన కింద పని చేయడం ఏమిటని ఫీలయ్యారు. రేవంత్ స్వయంగా వెళ్లి మాట్లాడినా చాలా మంది సర్దుకోలేదు. కానీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది మాత్రం ఎక్కువగా జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే. తర్వాత ఉత్తమ్ కమార్ రెడ్డి తనపై కాంగ్రెస్ నేతలే దష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు.  కర్ణాటక ఫలితాల తర్వాత ఏర్పడిన వాతావరణం.. డీకే శివకుమార్, ప్రియాంకా గాంధీ  బాధ్యతలు తీసుకోవడంతో ఎలాగైనా గెలిపించి పెడతారన్న నమ్మకానికి వస్తున్నారు. మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న సంకేతాలు.. తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అంచనాలతో అంతా సైలెంట్ అయిపోయారు. 


బీజేపీలో అంతర్గత కలహాలు - ఆ పార్టీలో భిన్న పరిణామాలు


కాంగ్రెస్ హైకమాండ్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి ఒక్కరే కాదని.. పార్టీ అంటే అందరూ ఉంటారని..కానీ ఆయన నాయకత్వ స్తానంలో ఉన్నారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచిస్తున్నారు. ధిక్కరిస్తే మాత్రం వెటేనని సంకేతాలిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చాలా సార్లు చెప్పింది కానీ ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పడు మాత్రం కత్తి నూరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేని స్థితికి వెళ్లిపోయింది. అయితే  బీజేపీలో ఇంకా బహిరంగ విమర్శలు ప్రారంభం కాలేదు.  అలాంటివి ప్రారంభమైతే.. ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో మరింత దిగజారిపోతుంది.  రాజకీయాల్లో ఏదైనా గెలుపు ఆశలే పార్టని నిలబెడతాయి. ఇంత కాలం కాంగ్రెస్ కు చాన్స్ లేదని అనుకున్నారు .అందుకే ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అయింది. కానీ ఇప్పుడు గెలిచే పార్టీ అనే పరిస్థితి రావడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. సర్దుకుపోతున్నారు. కానీ వెనుకబడిపోతుందని భావిస్తున్న బీజేపీలో మాత్రం లుకలుకలు పెరిగిపోతున్నాయి.


ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ మరింత పుంజుకుంటుందా ?


ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ మరింత పుంజుకుంటుందనే వాదన వినిపిస్తున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయబోతున్నారు. సభను విజయవంతం చేసి.. కర్ణాటక తరహాలో పతకాలకు గ్యారంటీలు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఖమ్మం సభ తర్వాత జూపల్లి మహబూబ్ నగర్‌లో సభ నిర్వహించనున్నారు. దానికీ రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇలా వరుస సభలతో దూసుకెళ్తామని..  ఎవరూ ఆపలేరని  కాంగ్రెస్ నేతలు నమ్మకానికి వస్తున్నారు.