YS Jagan camp office controversy : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నీచర్‌ను అక్రమంగా తన ఇంట్లో ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎక్కవగా తన క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన చేసేవారు. సెక్రటేరియట్ కు కేవలం మంత్రి వర్గ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చేవారు. తాడేపల్లిలోని తన ఇంటి పక్కనే మరో భవనం నిర్మించారు. దాన్నే క్యాంప్ ఆఫీసుగా చెబుతున్నారు. సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పరంగా జీవోలు విడుదల చేసి ఆ ఇంటికి అదనపు సౌకర్యాలు, ఫర్నీచర్ కల్పించారు. అంతాప ప్రజాధనంతోనే కల్పించారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎంగా రాజీనామా చేశారు. ఇప్పుడు తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించిన భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రకటించారు. ఆ పార్టీ కార్యాలయంలోనే జగన్ తన పార్టీ సమీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీలతో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశం వైరల్ అయింది. దీనికి కారణం ఎప్పుడూ అధికారిక సమీక్షలు, రివ్యూలు, బటన్లు నొక్కే కార్యక్రమాలు నిర్వహించే చాంబర్ లోనే ఆయన సమావేశం పెట్టారు. ఇప్పటి వరకూ అది సెక్రటేరియట్ అనుకున్నాం కానీ జగన్ ఇల్లా అని ఆశ్చర్యపోతున్నారు టీడీపీ కార్యకర్తలు.
జగన్‌కు చెందిన ప్రైవేటు ఆస్తికి ఆయన సీఎం అయిన మొదటి ఐదు నెలల్లోనే రూ. 15 కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు రిలీజ్ చేసుకున్నారని జీవోలతో సహా కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీటిని జగన్ వద్ద నుంచి రికవరీ చేయాలని అంటున్నారు.
సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ఇల్లు, క్యాంప్ ఆఫీస్ పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ భవనం అయితే.. ఆయన పదవి నుంచి దిగిపోయాక ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది. కానీ అది ప్రైవేటు భవనం. గతంలో చంద్రబాబు తన ఇంటి పక్కన ప్రజావేదిక నిర్మించారు. సీఎంగా దిగిపోయాక దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ అక్రమ కట్టడం అని జగన్ కూల్చివేయించారు. ఇప్పుడు జగన్ ఇంటిని అలా స్వాధీనం చేసుకునే అవకాశం లేదు. అది ప్రైవేటు ఆస్తి. అయితే ఆ ఇంటికి ప్రభుత్వం తరపున చేసిన ఖర్చును రికవరీ చేయించవచ్చని టీడీపీ నేతలంటున్నారు.
గతంలో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు రెండు లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్ అధీనంలో ఉంచున్నారని ఆయనపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు జగన్ చేస్తున్నదేమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.