Chandrababu Slams Cm Jagan In Aluru Meeting: రాష్ట్రంలోనే అత్యంత ధనికుడు సీఎం జగన్ (Cm Jagan) అని.. రాష్ట్రాన్ని ఆయన రూ.13 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరులో (Aluru) శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ భవిష్యత్ మార్చే ఎన్నికలని అన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని.. గ్రామాల్లో సర్పంచ్ లకే అధికారం ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కూడా అవసరమని.. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు భారీ సంఖ్యలో టీడీపీ అభిమానులు, శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.






వైసీపీపై ప్రశ్నల వర్షం


ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. 'అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఆ హామీ ఏమైంది.?. వైసీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా.?. విద్యపై పెట్టిన ఖర్చు ఎంత.?. వచ్చిన ఫలితాలేంటి.?. ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు దాచింది ఎంత.?. దోచుకున్నది ఎంత.?. ఇష్టానుసారంగా భూములు దోచుకున్నారు. సీఎం జగన్ చెప్పే మాటలు చేసే పనులకు పొంతన ఉందా.?. రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఇవ్వలేదు. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా.?. యువతకు ఉద్యోగాలు ఇచ్చారా.? ఆరోగ్య శ్రీ బిల్లులు సైతం చెల్లించలేదు.' అని చంద్రబాబు మండిపడ్డారు. ఎంపీటీసీని ఎంపీగా నిలబెట్టి గెలిపించబోతున్నామని అన్నారు. టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో సీఎం జగన్ అన్ని రంగాలను, వ్యవస్థలను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.


బాలుడి మృతిపై దిగ్భ్రాంతి


విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ (10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 'సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడం, బాలుడిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలి తీసుకున్నాయి. భరద్వాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.






Also Read: Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!