Nandamuri Balakrishna Assets: సత్యసాయి జిల్లా హిందూపురంలో (Hindupuram) టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ (Balakrishna) శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కు వేస్తున్న సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ పత్రాల్లో ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్ (Election Affadavit)లో చూపించారు. దీని ప్రకారం బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు కాగా, ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలుగా ఉంది. ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63 లక్షల 66 వేలుగా ఉంది. అటు, అప్పులకు సంబంధించి బాలకృష్ణకు రూ.9 కోట్లు 9 లక్షల 22 వేలు అప్పు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన భార్య వసుంధర అప్పులు రూ.3 కోట్ల 83 లక్షల 89 వేలుగా చూపించారు.


ప్రత్యేక పూజలు 


బాలకృష్ణ నామినేషన్ కు ముందు ఆయన సతీమణి వసుందర దేవితో కలిసి సెంటిమెంట్ గా ఉన్న సుగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన కారులో ఆర్వో కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 12:30 గంటలకు నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరం బాలకృష్ణ బయటకు రాగా నాయకులు ఆయన్ని పైకెత్తుకొని జై బాలయ్య జై జై బాలయ్య అని నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇక్కడ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా బాలకృష్ణ అన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. మా కుటుంబం అంటే హిందూపురం ప్రజలకు ఎంతో అభిమానం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించాం. గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చాం. అన్న క్యాంటీన్లను ప్రభుత్వం తొలగించినా హిందూపురంలో రోజుకు 400 మందికి భోజనాలు ఏర్పాటు చేశాం. దేవుని ఆశీస్సులతో ప్రజల దీవెనలతో మూడోసారి హిందూపురం అసెంబ్లీ నుంచి విజయం సాధిస్తాను. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ ఎన్నికల బరిలో నిలవడం శుభ పరిణామం. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం' అని పేర్కొన్నారు. 


భువనేశ్వరి సహా ప్రముఖుల నామినేషన్లు


రాష్ట్రంలో రెండో రోజు కూడా నామినేషన్ల సందడి నెలకొంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి  నామినేషన్ వేశారు. స్థానిక ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. అటు, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, కొండెపి టీడీపీ అభ్యర్థిగా డోలా బాలవీరాంజనేయ స్వామి, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన), యర్రగొండపాలెంలో గూడూరు ఎరిక్సన్ (టీడీపీ), కావలిలో కావ్య కృష్ణారెడ్డి (టీడీపీ), విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ (టీడీపీ) తరఫున ఆయన సతీమణి అనూరాధ, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ), మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ పత్రాలు సమర్పించారు. అలాగే, పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు సైకిల్ పై వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. 


Also Read: Tekkali YSRCP : టెక్కలి వైసీపీ అభ్యర్థిపై రెబల్‌గా భార్య పోటీ - హాట్ టాపిక్‌గా దువ్వాడ ఫ్యామిలీ రాజకీయం !