Sarath Chandra Reddy was approved in the Delhi liquor scam case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు సీఆర్పీసీ 164 ప్రకారం జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. గతంలో ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ బెంచ్ జడ్జి కావేరి భవేజా ఎదుట శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
కవితపై ప్రధాన సాక్ష్యం శరత్ చంద్రారెడ్డి చెప్పిన వివరాలే !
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో సీబీఐ కోర్టుకు తెలిపింది. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి .. కవిత జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంది.
లేని భూమిని అమ్మినట్లు చూపి రూ. 14 కోట్లు వసూలు
నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ. 80లక్షలు చెల్లించారట. మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పారట. కానీ, రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది.
అప్రూవర్ గా మారి అన్ని శరత్ చంద్రారెడ్డి చెప్పినవే !
ఒక్కో రిటైల్ జోన్‌కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు . ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25 కోట్లు చెల్లించారని సిబిఐ చెబుతోంది. మాగుంట రాఘవ కూడా అప్రూరవర్ అయ్యారు. ఇండో స్పిరిట్స్‌లో 65శాతం వాటా కవిత పొందారని.. సీబీఐ చెబుతోంది.
స్వయంగా నిందితులు అప్రూవర్లు గా మారి .. బెదిరిస్తేనే డబ్బులు ఇచ్చామని చెప్పడంతో కవితకు అనేక సమస్యలు చుట్టుముట్టినట్లుగా కనిపిస్తోంది. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ యజమానుల్లో ఒకరు. ఔరో రియాలిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. ఏపీలో కాకినాడ పోర్టును ఈ సంస్థ దక్కించుకుంది. దానిపైనా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.