Chandrababu Speech in Kovvuru: సీఎం జగన్ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన 'ప్రజాగళం' (Prajagalam) సభల్లో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉందని.. రక్తంలో మునిగిన ఆ పార్టీకి ఓట్లు వెయ్యొద్దని అతని తల్లి చెల్లి కోరుతున్నారని అన్నారు. హత్యలు, శవ రాజకీయాలు చేసే వారు ప్రజలకు కావాలా.? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడానికే జనసేన, బీజేపీతో జత కట్టామని పునరుద్ఘాటించారు. 


ఆ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు


రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదని.. కానీ వాళ్లు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వొద్దని, ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు కోరారు. పింఛన్ల కోసం ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారని.. ఇలాంటి ఘటనలు జరగకుండా పింఛన్ల పంపిణీ చేపట్టాలని అన్నారు. 'సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుంది. మా ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. వైసీపీ ఇవ్వలేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చాక రూ.4 వేల చొప్పున పింఛన్ ఇస్తామన్నాం. దీంతో భయపడి బుధవారం వెంటనే డబ్బులు విడుదల చేశారు. ప్రశ్నిస్తే గొడ్డలి చూపి బెదిరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ను ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.' అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 


'సూపర్ సిక్స్ అమలు'


టీడీపీ అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని.. సంపద సృష్టించి పేదలకు పంచుతామని చంద్రబాబు అన్నారు. 'వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ మద్యం ఉండవు. ఇసుక కొరత ఉండదు. విద్యుత్ ఛార్జీలు పెరగవు. రైతు కూలీల కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి వారిని ఆదుకుంటాం. టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదలకు రెండు సెంట్ల స్థలం ఇస్తాం. ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టిస్తాం. పోలవరం ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు ప్రమాదంలో పడతాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 3 పంటలకు నీరు ఇవ్వాలనుకున్నాం. కానీ, జగన్ స్వార్థం, అవినీతికి ప్రాజెక్ట్ బలైపోయింది. టీడీపీ హయాంలో దళితులకు భూములు ఇస్తే.. వైసీపీ హయాంలో వారికి ద్రోహం చేశారు. ఎస్సీలకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. ఎస్సీలపై 6 వేలకు పైగా కేసులు పెట్టారు. ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్ మద్దతుగా ఉన్నారు. మే 13న సైకిల్, కమలం, గాజు గ్లాసు గుర్తులకు ఓటేసి.. జగన్ ను ఇంటికి పంపించాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


అనపర్తి సీటుపై


అటు, పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన అనపర్తి అసెంబ్లీ స్థానంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సీటు బీజేపీకి కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదని కొవ్వూరు ప్రజాగళం సభలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్థానానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలుత టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, బీజేపీతో పొత్తు నేపథ్యంలో కమలం పార్టీ శివకృష్ణంరాజును అభ్యర్థిగా నిలబెట్టింది. దీనిపై నల్లమిల్లి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే, ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తే రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానంలో బీజేపీకి గెలుపు సులభతరం అవుతుందనే వాదన గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ స్థానం మార్పుపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


Also Read: Amanchi Krishnamohan : ప్రకాశం వైసీపీకి షాక్ - ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా