CM Jagan Slams Chandrababu: 14 ఏళ్లు సీఎంగా చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా.? అని సీఎం జగన్ (CM Jagan) ప్రశ్నించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో (Naidupeta) గురువారం 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర సాగింది. సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 'మరో 5 వారాల్లో ఎన్నికలనే మహా సంగ్రామం జరగనుంది. ప్రతీ వర్గానికి మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమి తలపడుతున్నాం. ఇవి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. పేద, సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మీ ఓటు మన తలరాతను, మన భవిష్యత్తును మారుస్తుంది. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4 వరకూ ఓపిక పట్టండి. మళ్లీ మీ అందరి ప్రభుత్వం రాబోతుంది. అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుంది. పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తాం.' అని జగన్ స్పష్టం చేశారు.
'పెన్షన్ల పంపిణీ అడ్డుకున్నారు'
'ఈ ఎన్నికలు పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి చేశాం. అన్ని సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. దశల వారీగా పెన్షన్లను రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చాం. వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటింటికీ పెన్షన్లు అందించాం. అలాంటిది తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా తాతలు ప్రాణాలు కోల్పోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనకు కోట్ల మంది అభిమానం ఉంటే.. ఎల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. నా వెంట నా తోబుట్టువులు ఉన్నారు. మనసారా ఆశీర్వదించే పేద అవ్వాతాతలు ఉన్నారు. జగన్ మామ అని పిలిచే చిన్నారులు ఉన్నారు. పేదల భవిష్యత్తు మార్చేలా 58 నెలలుగా అడుగులు పడ్డాయి.' అని సీఎం జగన్ పేర్కొన్నారు.
అంతకు ముందు, సీఎం జగన్ చిన్న సింగనమలలో లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించారు. టిప్పర్ డ్రైవర్ ను చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్ ఇచ్చానని సీఎం తెలిపారు. 'వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్, బీఈడీ చదివారు. ఉపాధి కోసం టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. జగన్ టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చాడని చంద్రబాబు అవహేళన చేశారు. అయినా, టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే తప్పేంటి.?. రూ.కోట్లు ఉన్న వారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు.' అంటూ జగన్ మండిపడ్డారు.