Amanchi Krishnamohan has resigned from YSRCP : ప్రకాశం జిల్లా వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించారు.. ఈ నెల 9న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే తాను వైసీపీ నుంచి బయటకు వస్తున్నానని ప్రకటించారు.
చీరాల గడ్డను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ టిక్కెట్ ను సైతం వదిలేసుకున్నారు. కొన్నాళ్లు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గా ఉన్నారు. అయితే ఆయనకు అక్కడ పోటీ చేయడం ఇష్టం లేదు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు తేల్చి చెప్పారు. దీంతో హైకమాండ్ ఆయనను తప్పించి.. యడం బాలాజీని పర్చూరు ఇంచార్జ్ గా నియమించారు. తనకు చీరాల టిక్కెట్ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. కానీ వైసీపీ హైకమాండ్ పట్టించుకోలేదు. కొన్నాళ్లుగా ఆయన స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జనసేన, టీడీపీల్లో చీరాల నుంచి టిక్కెట్ లభించే అవకాశం కూడా లేదు. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరినా ఆయనకూ టిక్కెట్ లభించలేదు. ఈ కారణంగా తనకు ఇచ్చ చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. జనసేనలోనే ఉన్నానంటున్నారు కానీ… జనసేన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆమంచి కృష్ణమోహన్… చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు మంచి అనుచరగణం ఉంది. ఓ సారి ఇండిపెండెంట్ గా గెలిచిన సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. అయినా ఆయన ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆమంచి బ్రదర్స్ కలిసే రాజకీయాలు చేసేవారు. కానీ వారు వేసిన తప్పటడుగులు, ప్రత్యర్థులపై దాడులు వంటి ఘటనలతో చీరాల నియోజకవర్గంలో బలమైన వ్యతిరేక వర్గం ఏర్పడింది. గతంలో ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినా చివరికి వైసీపీలో చేరారు. న్యాయమూర్తులను దూషించిన కేసులోనూ సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. అయినా టిక్కెట్ దొరకలేదు. ఇప్పుడు మళ్లీ ఇండిపెండెంట్ గా పోటీకి సిద్దమవుతున్నారు.
చీరాలలో గత ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ తరపున పోటీ చేశారు. అక్కడ చివరి క్షణం వరకూ ఆయనే టీడీపీ అభ్యర్థి అనుకున్నారు. కానీ వైసీపీలో చేరడంతో చివరి క్షణంలో బలమైన అభ్యర్థిగా భావించి కరణం బలరాంకు టిక్కెట్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు, అద్దంకి నుంచి కరణం బలరాం రాజకీయాలు చేసేవారు. చీరాలలో గెలవడంతో అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీలో చేరడంతో ఆమంచికి ప్రాధాన్యం తగ్గించి.. కరణంకే ఇంచార్జ్ పదవి ఇచ్చారు. కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కు ఈ సారి వైసీపీ తరపున టిక్కెట్ లభించింది. దీంతో ఇక ప్రధాన పార్టీల తరపున అభ్యర్థిత్వం దక్కదని క్లారిటీ రావడంతో.. ఆమంచి కృష్ణమోహన్ సొంత పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు.