Jeevan Reddy : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో కొంత మంది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నారు. బయట నుంచి వచ్చి తమపై పెత్తనం చేస్తున్నారని రేవంత్‌పై ఆరోపణలు చేస్తూ కొంత మంది పార్టీకి గుడ్ బై చెబుతున్న తరుణంలో ఆయనకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ సీనియ్ర నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెర ముందుకు వచ్చారు. పీసీసీ చీఫ్ ఓ సమన్వయ కర్త మాత్రమేనని.. తాము అంతా సోనియా నాయకత్వంలో పని చేస్తున్నామని గుర్తు చేశారు. ఓ సమన్వయకర్తగా అందర్నీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని ఆయన నేరుగా సపోర్ట్ చేసినట్లయింది. రేవంత్ రెడ్డి ఆయన పరిధి మేరకే పని చేస్తున్నారని జీవన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీ పీసీసీ చీఫ్ అందర్నీ సంతృప్తి పర్చలేరన్న జీవన్ రెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదని జీవన్ రెడ్డి అన్నారు. అయితే దాసోజు శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరం అని మరోసారి ఆలోచిస్తే బాగుండేదని వ్యాఖ్యలు చేశారు . ఇక హుజురాబాద్, మునుగోడులను రెండూ ఒకేలా చూడలేం.. రెండు వేరు వేరు పరిస్థితుల్లో రాజకీయంగా ప్రాధాన్యత పొందాయని కామెంట్ చేశారు. జీవన్ రెడ్డి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లో ఉన్న నేత. కాంగ్రెస్ పార్టీ అంటే తాము అని చెప్పుకునే కొద్ది మంది నేత్లలో ఆయన కూడా ఉన్నారు. అయితే చాలా మంది సీనియర్లు రేవంత్‌పై అసంతృప్తితో ఉంటే... జీవన్ రెడ్డి మాత్రం పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు.
సీనియర్లలో కొంత మంది రేవంత్‌కు సపోర్ట్
టీ పీసీసీ పదవి కోసం పోటీ పడిన వారిలో చాలా మంది ఇప్పుడు అసంతృప్తిలో ఉన్నారు. బయట పడటం లేదు కానీ.. రేవంత్ నాయకత్వం వారికి నచ్చడం లేదు. తామంతా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డామని ఇప్పుడు వచ్చి ఆయన పీసీసీ చీఫ్ అయి గెలిస్తే సీఎం అవుతాడని.. అలా ఎందుకు చేయాలని వారు అనుకుంటున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే అన్నారు. తామంతా కలిసి రేవంత్‌ను ఎందుకు సీఎం చేయాలని ప్రశ్నించారు.
వరుసగా రెండు సార్లు ఓడినా కాంగ్రెస్ నేతల్లో కనిపించని ఐక్యమత్యం
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఆదరణ ఉన్నా విజయం తీరాలకు చేర్చడంలో గత నేతలు ఫెయిలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయి..వచ్చిన ప్రతి ఉపఎన్నికల్లోనూ దారుణ పరాజయం పాలవుతోంది కాంగ్రెస్ పార్టీ. అయినా నేతల్లో ఆధిపత్య పోరాటమే. గ్రామ గ్రామాన ఉన్నక్యాడర్‌ను సమాయత్తం చేస్తే గెలుపు వస్తుందన్న విశ్లేషణలు ఉన్నా... సీనియర్లు తమ రాజకీయం తాము చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే కొంత మంది మాత్రం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ పార్టీయే కీలకమని అంటున్నారు.