Kesnineni Nani : చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తన అసహనం చూపించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగే " అజాదీ కా అమృత్ మహోత్సవ్" కమిటీ భేటీలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు ఎంపీలు స్వాగతం పలికారు. ఇలా స్వాగతం పలికిన వారిలో కేశినేని నాని కూడా ఉన్నారు. ఈ సమయంలో ఫ్లవర్ బోకేను కేశినేని నాని చేతుల మీదుగా ఇప్పించాలని ఎపీ గల్లా జయదేవ్ ప్రయత్నించారు. బోకేను ఆయన చేతికి ఇవ్వబోయారు. అయితే కేశినేని నాని ఆ బోకేను విసురుగా నెట్టేశారు. దీంతో గల్లా జయదేవ్ నే బోకే ఇచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన సోదరుడు కేశినేని శివనాథ్‌ను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నాడని నాని అనుమానం
ఇటీవల కేశినేని నాని కుటుంబంలో విభేదాలు వచ్చాయి. కేశినేని నాని సోదరుడు శివనాథ్ విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఆయనను ప్రోత్సహిస్తున్నారని కేశినేని నాని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుపై అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల కందట మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేసినప్పుడు చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. వాటిని ఆయనఖండించలేదు. కేశినేని శివనాథ్ మాత్రం విజయవాడలో పలువురు నేతలను కలుస్తూ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. తాను టీడీపీకీ నిఖార్సైన కార్యకర్తనేని టిక్కెట్ ఎవరికి ఇస్తే వారి విజయానికి కృషి చేస్తానని శివనాథ్ చెబుతున్నారు.
కుటుంబ సభ్యులతో సహా కేశినేని నాని కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొన్న టీడీపీ అధినేత
ఇటీవల కేశినేని నాని కుమార్తె వివాహ నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబసభ్యులందరితో హాజరయ్యారు. సొంత కుటుంబ కార్యక్రమం అన్నట్లుగా లోకేష్.. ఇతర టీడీపీ నేతలు సందడి చేయడంతో పరిస్థితులన్నీ సద్దుమణిగాయని అనుకున్నారు. కానీ కేశినేని నానిలో అసహనం మాత్రం దాచుకోవడం లేదు. నేరుగా మీడియా ముందే చంద్రబాబును అవమానించేలా వ్యవహరించడంతో ఆయన తీరుపై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది.
టీడీపీలో చర్చనీయాంశంగా కేశినేని నాని తీరు !
కేశినేని నాని చాలా కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ఆయనకు సఖ్యత లేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన బలంతో గెలుస్తామని .. ఏకపక్షంగా టీడీపీ తరపున ఆయన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత కూడా ఆయన అదే తీరును కొనసాగిస్తూండటంతో టీడీపీ నేతల్లోనే ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది.